కోతులు వెంటపడడంతో గుండె ఆగి బాలుడి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోతులు వెంటపడడంతో గుండె ఆగి బాలుడి మృతి

Boy dies of heart attack after being chased by monkeys
  • నడిగూడెం మండలం వల్లాపురంలో ఘటన
  • దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన నిశాంత్ గౌడ్
  • భయంతో గుండె ఆగి మరణించి ఉంటాడని అనుమానం
  • ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న పోలీసులు
నడిగూడెం మండలం వల్లాపురంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోతుల గుంపు వెంబడించడంతో భయాందోళనకు గురైన ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మొక్క వీరబాబు దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరి కుమారుడు మొక్క నిశాంత్ గౌడ్ (12) దసరా సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చాడు.

శుక్రవారం నిశాంత్ తన స్నేహితుడితో కలిసి అమ్మమ్మ ఇంటి నుంచి అదే గ్రామంలోని తమ సొంత ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోతుల గుంపు వారిని వెంబడించడంతో, వాటి నుంచి తప్పించుకునేందుకు భయంతో పరుగులు తీసిన నిశాంత్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో బాలుడి కాలి బొటనవేలుకు గాయమైంది.

వెంటనే స్పందించిన స్థానికులు బాలుడిని చికిత్స కోసం స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, ఆయన అందుబాటులో లేరు. దీంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, ఒక ఆటోలో ఖమ్మం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలో అంబులెన్స్ ఎదురురావడంతో బాలుడిని అందులోకి మార్చారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. తీవ్రమైన భయాందోళన కారణంగా బాలుడు గుండెపోటుతో మరణించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తమకు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని నడిగూడెం ఎస్ఐ తేజస్విని తెలిపారు.
Advertisement
Nishanth Goud
Monkey attack Vallapuram
Boy dies of heart attack Nadigudem
Monkey menace Suryapet
Child death after monkey chase
Vallapuram village tragedy

More Telugu News