బెంగాల్ లో మదర్సా శాఖ పరిధిలోని మతపరమైన పథకాలకు బ్రేక్
- బెంగాల్ లో తన మార్క్ చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వం
- మదర్సా శాఖ మత ఆధారిత ఆర్థిక సహాయ పథకాలను నిలిపివేయాలని నిర్ణయం
- జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
పశ్చిమ బెంగాల్లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం తన తన మార్క్ ను అత్యంతా వేగంగా చూపిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని నూతన కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో సరికొత్త రాజకీయ, సామాజిక దిశను సూచిస్తున్నాయి.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైన, సంచలనాత్మక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ.. జూన్ 1వ తేదీ నుంచి మహిళలకు నెలకు రూ. 3,000 ఆర్థిక సహాయాన్ని అందించే ప్రతిష్ఠాత్మక “అన్నపూర్ణ యోజన” పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనితో పాటు అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు. ఈ రెండు నిర్ణయాలు బెంగాల్ మహిళా ఓటర్లలో ప్రభుత్వంపై మరింత సానుకూలతను పెంచే అవకాశం ఉంది.
ఇక, అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పాలనాపరమైన మార్పు ఏంటంటే... మదర్సా శాఖ, సమాచార, సాంస్కృతిక శాఖల పరిధిలో ఇన్నాళ్లూ కొనసాగుతున్న మత ఆధారిత ఆర్థిక సహాయ పథకాలను దశలవారీగా పూర్తిగా నిలిపివేయాలని బెంగాల్ కేబినెట్ నిర్ణయించింది.