ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌, టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఐపీఎల్‌ 2026 సీజన్‌ మధ్యలో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన గర్ల్‌ఫ్రెండ్‌ మహీకా శర్మతో అతడు మళ్లీ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ వదంతులు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం.. వీటిల్లో నిజం లేదని తెలుస్తోంది. 

మరోవైపు వెన్నునొప్పి కారణంగా హార్దిక్‌ పాండ్యా ముంబై ఆడిన గత మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడులేని సమయంలో సూర్యకుమార్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టారు. హార్దిక్‌ నాయకత్వంపై మేనేజ్‌మెంట్‌ అసంతృప్తితో ఉందనే ప్రచారం జరుగుతున్న తరుణంలోనే పెళ్లి వదంతులు బయటకు రావడం గమనార్హం. మహీకా శర్మ గతంలో ముంబై ఇండియన్స్‌ టీమ్‌ బస్సులో ప్రయాణించడంతో పాటు మార్చిలో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ వేడుకల్లోనూ పాల్గొనడం ఈ వదంతులకు మరింత బలాన్ని చేకూర్చింది.

ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ముగింపు దశకు చేరిన తరుణంలో ముంబై ఇండియన్స్‌ జట్టు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో హార్దిక్‌ పాండ్యా రెండో పెళ్లి చేసుకునే అవకాశం అస్సలు లేదని విశ్లేషకులు చెబుతున్నారు. సీజన్‌ ముగిసిన తర్వాత వివాహం చేసుకునే అవకాశాలు మాత్రం లేకపోలేదు. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న హార్దిక్‌ ఈ పెళ్లి వార్తల వల్ల సోషల్‌ మీడియాలో మరోసారి ట్రోలర్లకు టార్గెట్‌గా మారారు.