బండి సంజయ్ కుమారుడు దేశం దాటి పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలి: కవిత
- కుమారుడి నేరం రుజువైతే బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలన్న కవిత
- మోదీతో బండి సంజయ్ వేదికను పంచుకోవడం తప్పుడు సంకేతాలు పంపిందని వ్యాఖ్య
- తెలంగాణలో రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకే తమ పార్టీ పుట్టిందన్న కవిత
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. పోక్సో కేసులో ఉన్న బండి సంజయ్ కుమారుడు దేశం దాటి పోకుండా పోలీసులు వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఒకవేళ నేరం రుజువైతే బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తండ్రిగా బండి సంజయ్ ప్రధాని మోదీతో కలిసి వేదికను పంచుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిందని ఆమె అభిప్రాయపడ్డారు. బాధితురాలి జీవితాన్ని దెబ్బతీసేలా వీడియోలు పోస్ట్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని, ఆ అకౌంట్లను బ్లాక్ చేయాలని కోరారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని కవిత అన్నారు. ఇప్పటివరకు ఆయన ఈ ప్రాజెక్టును ఒక్కసారి కూడా సందర్శించకపోవడం ఏమిటని ఆమె ఆక్షేపించారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం నీటి వనరుల వినియోగంలో విఫలమవుతోందని విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కులగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా ఉండాలని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్తంగా పోరాడతామని కవిత తెలిపారు. నీట్ పేపర్ లీక్ గురించి ఆమె మాట్లాడుతూ... జాతీయ స్థాయి పరీక్షల పేపర్ లీక్ ఘటనలను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. తెలంగాణలో ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికే తమ పార్టీ పుట్టిందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.