కోహ్లీని అప్రతిష్ఠపాలు చేసేందుకు భారీ కుట్ర? .. జర్మన్ మోడల్ లిజ్‌లాజ్ సంచలన నిజాలు!
- కోహ్లీ తన ఫొటోకు లైక్ కొట్టిన తర్వాత కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారన్న లిజ్‌లాజ్
- కోహ్లీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేశారని వెల్లడి
- భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశారన్న లిజ్‌లాజ్
కోహ్లీ తన ఇన్‌స్టా ఫొటోకు లైక్ కొట్టిన తర్వాత తనను కొందరు జర్నలిస్టులు సంప్రదించారని జర్మన్ మోడల్, సింగర్ లిజ్‌లాజ్ బాంబు పేల్చింది. కోహ్లీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేయాలని, అతను తనకు పర్సనల్ మెసేజ్‌లు చేస్తున్నట్లు అబద్ధాలు చెప్పాలని వారు కోరారని వెల్లడించింది. ఇందుకు గానూ ఆమెకు భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశారట. అయితే విరాట్ పట్ల ఉన్న గౌరవం,తన విలువలకు కట్టుబడి ఆ ఆఫర్లను తాను తిరస్కరించానని ఆమె స్పష్టం చేసింది. డబ్బు కోసం ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడం తన వల్ల కాదని ఆమె తన ఇంటర్వ్యూలో తెగేసి చెప్పింది.
లిజ్‌లాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీని టార్గెట్ చేసేందుకు కొంతమంది ఎంత నీచానికి ఒడిగడుతున్నారో ఈ ఘటన ద్వారా అర్థమవుతోందని కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడిపై ఇలాంటి పెయిడ్ క్యాంపెయిన్స్ నిర్వహించడం సిగ్గుచేటని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
జర్మనీకి చెందిన లిజ్‌లాజ్ (అసలు పేరు జెన్నిఫర్) కేవలం మోడల్ మాత్రమే కాదు, ఆమె ఎంతో ప్రతిభావంతురాలు. ఆమె సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేసింది. జర్మన్, డచ్, ఫ్రెంచ్ వంటి ఐదు భాషల్లో పట్టున్న ఆమెకు భారతీయ సంస్కృతి అన్నా, ఆహారం అన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆమె పెద్ద అభిమాని. ఈ వివాదం తర్వాత కూడా ఆమె ఆర్‌సీబీ జెర్సీ ధరించి కోహ్లీకి మద్దతు తెలుపుతూ పోస్ట్‌లు చేయడం విశేషం.