భారీగా పెరిగిన ఏపీ అప్పు.. పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన

Andhra Pradesh debt increased significantly Central Government key statement in Parliament
  • ఏపీ అప్పు రూ.6.45 లక్షల కోట్లకు చేరిందని ప్రకటించిన కేంద్రం
  • గత రెండేళ్లతో పోలిస్తే గణనీయంగా పెరిగిన రాష్ట్ర రుణం
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలోనూ వృద్ధి నమోదు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా అప్పుల వివరాలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టతనిచ్చింది. 2026 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.6,45,461 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ వివేక్ ఠంకా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత రెండేళ్ల గణాంకాలతో పోల్చితే రాష్ట్ర అప్పు గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.

కేంద్ర మంత్రి అందించిన వివరాల ప్రకారం.. 2024లో ఏపీ అప్పు రూ.4,92,568 కోట్లుగా ఉండగా, అది 2025 నాటికి రూ.5,65,534 కోట్లకు చేరింది. తాజాగా ఇది రూ.6,45,461 కోట్లకు పెరిగింది. అంటే.. 2024 నుంచి 2025 మధ్య అప్పు 14.81శాతం పెరగగా, 2025 నుంచి 2026 మధ్య 14.13శాతం వృద్ధి నమోదైందని మంత్రి తన సమాధానంలో వివరించారు.

అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, తలసరి ఆదాయం కూడా పెరుగుతున్నట్లు కేంద్రం తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 2023-24లో రూ.14.23 లక్షల కోట్లు ఉండగా, 2025-26 నాటికి అది రూ.17.62 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక, రాష్ట్ర తలసరి ఆదాయం కూడా 2023-24లో రూ.2.39 లక్షల నుంచి 2025-26 నాటికి రూ.2.94 లక్షలకు పెరిగినట్లు తెలిపారు.

పోర్టుల అభివృద్ధిపై కీలక వివరాలు
మరోవైపు రాష్ట్రంలో కీలకమైన పోర్టుల నిర్మాణ పురోగతిపై కూడా కేంద్రం పార్లమెంటులో వివరాలు అందించింది. టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పోర్టుల శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ సమాధానమిచ్చారు. రామాయపట్నం పోర్టు తొలిదశ నిర్మాణం 80.55 శాతం పూర్తయిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో రూ.45 కోట్లతో అటానమస్ మారిటైం షిప్‌యార్డ్, సిస్టమ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయని, దీని ద్వారా 750 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Advertisement
Andhra Pradesh
AP Debt
Central Government
Pankaj Chaudhary
Ramayapatnam Port
Andhra Pradesh Economy

More Telugu News