‘కేసులు ఎత్తి వేయకపోతే మళ్లీ ఉద్యమిస్తాం’.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం

Cockroach Janata Party ultimatum to Center we will protest again if cases are not withdrawn
  • విద్యార్థుల ఆందోళనల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు
  • కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అనుకూలంగా మార్చుకుంటోందని సీజేపీ ఆరోపణ
  • కేసుల ఉపసంహరణ ప్రభుత్వ అధికారమేనని వాదన
  • పలు రాష్ట్రాల్లో నిరసనకారులను వేధిస్తున్నారని ఆరోపణ
  • హామీలు అమలు కాకపోతే మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరిక
నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై చేపట్టిన ఉద్యమాన్ని విరమించిన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ) మరోసారి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరిస్తామని ఇచ్చిన హామీ అమలు కాకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలను సాకుగా చూపుతూ ప్రభుత్వం హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించింది.

ఈ అంశంపై ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడిన సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యమం సందర్భంగా నమోదైన ప్రజాహిత వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపిన తర్వాత కేంద్రం వైఖరి మారిందన్నారు. నిరసనకారులపై కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన కేసులను కూడా ఉపసంహరిస్తామని ప్రభుత్వం బహిరంగంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కేసు కోర్టు పరిధిలో ఉందని చెబుతూ ఆ హామీ అమలును వాయిదా వేస్తోందని విమర్శించారు.

సుప్రీంకోర్టు శాంతియుత నిరసనకారులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసిందని సౌరవ్‌ దాస్‌ చెప్పారు. నేరచరిత్ర లేని నిర్బంధితులను విడుదల చేయాలని కూడా ఆదేశించిందన్నారు. అయితే ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు కొనసాగించవచ్చని కోర్టు పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంటోందని ఆరోపించారు. కోర్టు ఎక్కడా ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించరాదని చెప్పలేదని, ఆ అధికారం పూర్తిగా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

మంగళవారంలోగా ఈ విషయంపై కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ వస్తుందని ఆశించామని, కానీ అలాంటి సమాచారం ఇప్పటివరకు అందలేదని సౌరవ్‌ దాస్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ యువతపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. చర్చల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పకుండా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌, గోవా, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై వేధింపులు కొనసాగుతున్నాయని సీజేపీ ఆరోపించింది. కొందరిపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని తెలిపింది. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ రక్షణ కల్పించాలని, నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించాలని మొదటి నుంచే డిమాండ్‌ చేస్తున్నామని సౌరవ్‌ దాస్‌ అన్నారు. హామీలు అమలు కాకపోతే విద్యార్థులకు మద్దతుగా మళ్లీ వీధుల్లోకి వస్తామని హెచ్చరించారు.
Advertisement
Cockroach Janata Party
Saurav Das CJP
NEET Paper Leak Protests
Central Government FIR Withdrawal
Student Protest Cases
Supreme Court NEET Ruling

More Telugu News