భారత్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో 576 మంది.. ఐదేళ్లలో 300 శాతం వృద్ధి!

Indian Billionaires 576 people in 100 crore club with 300 percent growth in five years
  • పార్లమెంటులో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
  • దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గుతున్నాయన్న కేంద్ర ఆర్థిక శాఖ
  • బిలియనీర్ అనే పదానికి అధికారిక నిర్వచనం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం
భారత్‌లో అపర కుబేరుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం పొందుతున్న వారి సంఖ్య 2025-26 మదింపు సంవత్సరానికి 576కి చేరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. గత మదింపు సంవత్సరంలో (2024-25) ఈ సంఖ్య 415గా ఉండగా, ఈసారి మరింత పెరగడం గమనార్హం.

ఐదేళ్ల క్రితం, అంటే 2021-22 మదింపు సంవత్సరంలో రూ.100 కోట్లకు పైగా ఆదాయం చూపిన వారు కేవలం 142 మంది మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సంఖ్య 300 శాతానికి పైగా పెరిగింది. ఈ గణాంకాలు దేశంలో అత్యధిక ఆదాయ వర్గాల సంఖ్య వేగంగా వృద్ధి చెందుతున్న తీరును స్పష్టం చేస్తున్నాయి. పార్లమెంట్‌లో బిలియనీర్ల సంఖ్య పెరిగిందా? అని అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ డేటాను వెల్లడించింది.

అయితే, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ‘బిలియనీర్’ అనే పదానికి అధికారికంగా ఎలాంటి నిర్వచనం లేదని మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. అందువల్ల, రూ.100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్నవారిని అత్యధిక ఆదాయం కలిగిన వర్గంగా పరిగణించి ఈ వివరాలు అందిస్తున్నట్లు తెలిపారు. సంపద పన్ను చట్టం-1957ను 2016 ఏప్రిల్ 1న రద్దు చేసినందున, వ్యక్తుల మొత్తం సంపదపై తమ వద్ద అధికారిక డేటా ఏదీ లేదని ప్రభుత్వం పేర్కొంది.

తగ్గుతున్న ఆర్థిక అసమానతలు: కేంద్రం
దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయన్న ఆందోళనలపై కూడా కేంద్రం స్పందించింది. దీనికి భిన్నంగా దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గుతున్నాయని తెలిపింది. 2023-24 కుటుంబ వినియోగ వ్యయ సర్వే (హెచ్‌సీఈఎస్) ప్రకారం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అసమానతలను సూచించే గిని కోఎఫిషియంట్ తగ్గిందని ప్రభుత్వం ఉదహరించింది. నిరుద్యోగిత రేటు 2022లో 3.6 శాతం నుంచి 2025 నాటికి 3.1శాతానికి పడిపోయిందని పేర్కొంది. అలాగే, నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం 2013-14 నుంచి 2022-23 మధ్య దాదాపు 24.82 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది.

అధిక ఆదాయం ఉన్న వారిపై అదనపు సర్‌చార్జి విధించడం వంటి చర్యలతో పాటు, పీఎం ఆవాస్ యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాల ద్వారా అసమానతలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని కేంద్రం వివరించింది. మొత్తం మీద, అధిక ఆదాయం ఆర్జించే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ, దేశంలోని కుబేరుల నిజమైన సంపదపై పూర్తిస్థాయి చిత్రం మాత్రం అందుబాటులో లేదు.
Advertisement
Indian Billionaires
Pankaj Chaudhary
Income Tax India
100 Crore Club
Indian Economy Growth
Wealth Inequality India

More Telugu News