ఐపీఎల్ 2026 సగం పూర్తి.. ప్లేఆఫ్స్ రేసులో ఎవరు సేఫ్?.. ఎవరికి టెన్షన్?

IPL 2026 Points Table Favourites For Playoffs Who Can Qualify Check Latest Standings
  • టాప్ 4లో పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్, సన్‌రైజర్స్ 
  • చెన్నై, ముంబై జట్లకు సంక్లిష్టంగా మారిన ప్లేఆఫ్స్ ఛాన్స్‌
  • ప్లేఆఫ్స్ చేరాలంటే 16 పాయింట్లు కీలకం
  • మిగిలిన మ్యాచ్‌లలో తీవ్రంగా మారనున్న పోటీ
ఐపీఎల్ 2026 సీజన్ సరిగ్గా సగం పూర్తయింది. అన్ని జట్లు దాదాపు తమ తొలి ఏడు, ఎనిమిది మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. లీగ్ దశ ముగింపు వైపు సాగుతుండటంతో ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అద్భుత ప్రదర్శనతో టాప్ 4లో కొనసాగుతుండగా, టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తీవ్రంగా నిరాశపరిచాయి. ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలంటే సాధారణంగా 16 పాయింట్లు సురక్షిత స్కోరుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఏ జట్టుకు ఎన్ని విజయాలు అవసరమో చూద్దాం.

టాప్ 4 జట్ల సురక్షిత ప్రయాణం
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్న జట్లకు ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) 7 మ్యాచ్‌లలో 6 విజయాలతో 13 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. మిగిలిన 7 మ్యాచ్‌లలో కేవలం రెండు గెలిస్తే చాలు, పంజాబ్ సునాయాసంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కూడా 8 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లతో ఉంది. ఆర్సీబీ తన మిగిలిన 6 మ్యాచ్‌లలో రెండింటిలో గెలిస్తే ప్లేఆఫ్స్ ద్వారాలు తెరుచుకుంటాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చెరో 8 మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలతో 10 పాయింట్ల చొప్పున సాధించాయి. ఈ రెండు జట్లు తమ మిగిలిన 6 మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటాయి.

మధ్యలో ఉన్న జట్ల పోరాటం
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల పరిస్థితి కాస్త సంక్లిష్టంగా ఉంది. 8 పాయింట్లతో ఉన్న గుజరాత్, ప్లేఆఫ్స్ చేరాలంటే తన చివరి 6 మ్యాచ్‌లలో కనీసం నాలుగింటిలో గెలవాలి. చెన్నై సూపర్ కింగ్స్ ఆరు పాయింట్లతో ఉంది. సీఎస్‌కే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే, మిగిలిన 6 మ్యాచ్‌లలో ఐదింటిలో గెలవడం తప్పనిసరి. ఆరంభంలో దూకుడు చూపిన ఢిల్లీ క్యాపిటల్స్, ఇప్పుడు డేంజర్ జోన్‌లో పడింది. 8 మ్యాచ్‌లలో కేవలం 3 గెలిచిన ఢిల్లీ, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్‌లలో ఐదింటిలో గెలిచి తీరాల్సిందే. ఈ జట్లకు ఇకపై ప్రతీ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే.

గల్లంతైన ఆశలతో చివరి జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌), ముంబై ఇండియన్స్ (ఎంఐ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) జట్ల ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. కేకేఆర్ 5 పాయింట్లతో, ముంబై, లక్నో చెరో 4 పాయింట్లతో పట్టికలో అట్టడుగున ఉన్నాయి. కేకేఆర్, లక్నో జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌లలో ఆరింటినీ గెలవాలి. ఇది అసాధ్యం కాకపోయినా, అత్యంత కఠినమైన సవాల్. ప్రపంచస్థాయి ఆటగాళ్లతో నిండిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైంది. కేవలం 2 మ్యాచ్‌లే గెలిచిన ముంబై, మిగిలిన 7 మ్యాచ్‌లలో కనీసం 6 గెలవాలి. గ‌ట్టిపోటీ దృష్ట్యా ఏడుకి ఏడు గెలిస్తేనే ఆ జట్టుకు అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే, ఐపీఎల్ రెండో సగం మరింత హోరాహోరీగా సాగడం ఖాయం. రాబోయే మ్యాచ్‌లలో ఏ జట్టు ఎలా రాణిస్తుందో, ఎవరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తారో చూడాలి.
Go Back to Shorts
IPL 2026
IPL 2026 Points Table
Playoffs
PBKS
RR
MI
RCB

More Telugu News