ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'వేదవ్యాస్' చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణ కార్యక్రమాల్లో చివరి దశకు చేరుకుంది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, మాజీ శాసనసభ్యుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైందవ ధర్మ విశిష్టతను శాస్త్రీయ దృక్పథంతో వివరిస్తూ సాగే ఈ సకుటుంబ కథాచిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన కొత్త నిర్మాణ సంస్థ 'సాయి ప్రగతి ఫిలిమ్స్' బ్యానర్‌ను ఫిలిం నగర్‌లోని సాయిబాబా ఆలయంలో శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, సమర్పకులు అచ్చిరెడ్డితో కలిసి ఆయన పంచకట్టులో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మంట్ కీలక పాత్రల్లో నటిస్తుండటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీరితో పాటు సాయికుమార్, సుమన్, బాబు మోహన్, అలీ, రఘుబాబు, అజయ్ ఘోష్ వంటి ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఎప్పటిలాగే ఈ చిత్రానికి కూడా కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, సంగీతం, దర్శకత్వం అనే ఐదు ప్రధాన బాధ్యతలను ఎస్వీ కృష్ణారెడ్డి స్వయంగా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.