కాలేయంపై ప్లాస్టిక్ కణాల పంజా.. పెను ప్రమాదాన్ని మోసుకొస్తున్న మైక్రోప్లాస్టిక్స్!

Plastic particles may trigger liver disease risk Researchers
  • మైక్రో, నానోప్లాస్టిక్ కణాల వల్ల కాలేయానికి ముప్పు వాటిల్లుతోందని పరిశోధన వెల్లడి
  • జంతువులలో కాలేయ సమస్యలకు కారణమవుతున్న ప్లాస్టిక్స్ 
  • మనుషులపైనా అదే ప్రభావం చూపవచ్చని అంచనా
  • శరీరంలోకి చేరే ప్లాస్టిక్స్ క్యాన్సర్ కారకాలను, హానికర రసాయనాలను మోసుకెళతాయని ఆందోళన
మనం రోజూ పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారంలో కంటికి కనిపించకుండా కలిసిపోయిన మైక్రో, నానోప్లాస్టిక్ కణాలు మానవ ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని తాజా పరిశోధన ఒకటి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా శరీరంలోని కీలక అవయవమైన కాలేయంపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, కాలేయ వ్యాధులకు దారితీసే పరిస్థితులను కల్పిస్తున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ అధ్యయన వివరాలను "నేచర్ రివ్యూస్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్‌ హెపటాలజీ" జర్నల్‌లో ప్రచురించారు.

పరిశోధన ప్రకారం ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు జంతువులలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఫైబ్రోజెనిసిస్, ఇన్ఫ్లమేషన్ (కణజాల వాపు) వంటి సమస్యలకు కారణమవుతున్నాయని స్పష్టమైన ఆధారాలు లభించాయి. మనుషులలో ముదిరిన కాలేయ వ్యాధి లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయని, జంతువులలో జరుగుతున్న నష్టమే మనుషులలోనూ జరగవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.

శరీరంలోకి చేరే ప్రతి పదార్థాన్ని శుద్ధి చేసే ముఖ్యమైన ఫిల్టర్‌గా కాలేయం పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ కణాలు కాలేయంలోకి చేరినప్పుడు అవి హానికర సూక్ష్మజీవులు, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కారకాలు, అంతఃస్రావ వ్యవస్థను దెబ్బతీసే రసాయనాలు, క్యాన్సర్ కారకాలను సులభంగా కాలేయానికి రవాణా చేస్తాయని నిపుణులు వివరించారు.

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ శిల్పా చోక్సీ మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి 25 మరణాలలో ఒకటి కాలేయ వ్యాధుల వల్లే సంభవిస్తోంది. ఊబకాయం, మద్యపానం వంటివి ప్రధాన కారణాలైనప్పటికీ, ఈ స్థాయిలో వ్యాధి పెరుగుదలకు అవే పూర్తి కారణం కాదు. ప్లాస్టిక్స్ వంటి పర్యావరణ కారకాలు కూడా దీనికి దోహదపడుతున్నాయేమోనని మేము పరిశీలిస్తున్నాం" అని తెలిపారు.

శరీరానికి ద్వారపాలకుడిలా పనిచేసే కాలేయంలోకి ప్లాస్టిక్ కణాలు చేరడం వల్ల, ఇప్పటికే ఉన్న కాలేయ సమస్యలు మరింత తీవ్రతరం కావొచ్చని ఆమె వివరించారు. ఈ అంశంపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ కాలుష్యం అనేది పర్యావరణ సమస్య మాత్రమే కాదని, అది ప్రపంచ ఆరోగ్య సవాల్ అని ప్రొఫెసర్ రిచర్డ్ థాంప్సన్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Plastic particles
liver disease
Researchers

More Telugu News