నీరవ్ మోదీ అప్పగింత ఆలస్యంపై బ్రిటన్ మాజీ హోం కార్యదర్శి ప్రీతి పటేల్ సంచలన వ్యాఖ్యలు!
- నీరవ్ మోదీ ఇప్పటికీ లండన్ లోనే ఉండటం తనను కలచి వేస్తోందన్న ప్రీతి పటేల్
- మన వ్యవస్థ సరిగ్గా పనిచేసి ఉంటే ఆయన ఇండియాలో ఉండేవారని వ్యాఖ్య
- బ్రిటన్‌లో ఉన్న చట్టపరమైన లొసుగులు, సుదీర్ఘమైన అప్పీళ్ల ప్రక్రియ వల్లే అడ్డంకులు
- నీరవ్ అప్పగింతలో బ్రిటన్ విఫలం కావడంపై భారత్ అధికారులు ఆగ్రహంతో వున్నారని వ్యాఖ్య
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 14,000 కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడంలో జరుగుతున్న ఆలస్యంపై బ్రిటన్ మాజీ హోం కార్యదర్శి ప్రీతి పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రిటన్ న్యాయవ్యవస్థలో ప్రక్రియలు, సాకులు చూపుతూ అప్పగింతను అడ్డుకోవడం వల్ల భారత ప్రభుత్వం బ్రిటన్‌తో కలిసి పనిచేయాలనే ఉత్సాహాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.
2021 ఏప్రిల్‌లో బ్రిటన్ హోం కార్యదర్శిగా ఉన్న సమయంలో ప్రీతి పటేల్ నీరవ్ మోదీ అప్పగింత ఉత్తర్వులపై సంతకం చేశారు. అయితే, బ్రిటన్‌లో ఉన్న చట్టపరమైన లొసుగులు, సుదీర్ఘమైన అప్పీళ్ల ప్రక్రియ వల్ల ఆయన ఇప్పటికీ లండన్ జైలులోనే ఉండటంపై ఆమె ఒక పాడ్‌కాస్ట్ సంభాషణలో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఆయన (నీరవ్ మోదీ) ఇప్పటికీ ఈ దేశంలోనే ఉండటం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. మన వ్యవస్థ బాధ్యతాయుతంగా, సక్రమంగా పనిచేసి ఉంటే ఆయన ఎప్పుడో భారత్‌లో ఉండేవారు" అని ప్రీతి పటేల్ వ్యాఖ్యానించారు. నీరవ్ మోదీని అప్పగించడంలో బ్రిటన్ విఫలం కావడంపై భారత అధికారులు తీవ్ర ఆగ్రహంతో, నిరాశతో ఉన్నారని ఆమె తెలిపారు. బ్రిటన్ న్యాయవ్యవస్థలోని అప్పీళ్ల ప్రక్రియలను నీరవ్ మోదీ దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
లండన్‌లోని వ్యాండ్స్‌వర్త్ జైలులో ఉన్న నీరవ్ మోదీ అప్పగింతను అడ్డుకోవడానికి వరుసగా అప్పీళ్లు చేసుకుంటూ రాగా, బ్రిటన్ మాజీ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.