నా ప్రమేయం నిరూపిస్తే దేనికైనా సిద్ధం... ఆరోపణలపై మంగ్లీ తీవ్ర భావోద్వేగం

Mangli Reacts to Allegations Ready for Any Punishment If Proven Guilty
ప్రముఖ జానపద గాయని మంగ్లీ, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ న్యాయవాది సింగపోగు సుబ్బారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేవలం బిగ్ బాస్ షోలో అవకాశం కోసమే సుబ్బారావు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడుతూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందులో తన ప్రమేయం నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. నోట్లకట్టలతో కనిపించింది తన తమ్ముడు కాదని స్పష్టం చేశారు.

సుబ్బారావు ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంగ్లీ, "నాపై చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలు. గతంలో నా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను తొలగించాలంటే రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. నేను డబ్బు ఇవ్వకపోవడంతోనే నాపై కక్షగట్టి ఇలాంటి నీచమైన ప్రచారానికి దిగారు" అని మంగ్లీ ఆరోపించారు.

వివాదం నేపథ్యం ఇదే
కొద్ది రోజుల క్రితం న్యాయవాది సుబ్బారావు, సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక ప్రజల నుంచి సుమారు రూ.10 కోట్లు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఈ విషయంపై మంగ్లీ, ఆమె సోదరులు తనను ఫోన్‌లో బెదిరించారని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మంగ్లీ ఆవేదన 
మీడియా సమావేశంలో మాట్లాడిన మంగ్లీ, తనపై వస్తున్న ఆరోపణల కారణంగా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. "ఎక్కడ చూసినా మంగ్లీ, మంగ్లీ అంటూ ఈ నెగెటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్ చేస్తున్నారు? నా మంచి పనులను ఎవరూ గుర్తించరు. ఇదే పరిస్థితి మీ ఇంట్లో అక్కాచెల్లెళ్లకు ఎదురైతే మీరు తట్టుకోగలరా? చాలా మంది నాతో ఫోటోలు దిగుతారు. ఎవరో చేసిన తప్పులకు నన్ను బాధ్యురాలిని చేయడం ఎంతవరకు సమంజసం? మీడియా కుటుంబం నుంచే వచ్చిన నన్ను ఇలా వేధించడం సరికాదు" అని ప్రశ్నిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

న్యాయవాది సుబ్బు కేవలం పాపులారిటీ కోసమే తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని మంగ్లీ ఆరోపించారు. "ఆయనకు ఫేమస్ అవ్వాలనే కోరిక ఉంది. వచ్చే ఏడాది బిగ్ బాస్‌కు వెళతానని, యాంకర్ శ్రీముఖి అంటే క్రష్ అని ఆయనే చెబుతున్నారు. అలాంటి వ్యక్తి ప్రచారం కోసం నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నాతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ప్రవర్తన సరిగా లేదు. దానికి సంబంధించిన వీడియో నా దగ్గర ఉంది" అని చెబుతూ దాన్ని మీడియాకు చూపించారు. ఆయన తనతో వల్గర్‌గా మాట్లాడారని, ఆకాశం నుంచి ఊడిపడ్డావా అంటూ అసభ్య పదజాలం వాడారని మండిపడ్డారు.

ఈ కేసులో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధమని మంగ్లీ సవాల్ విసిరారు. "నా ప్రమేయం లేదని తేలితే, ఆరోపణలు చేసిన సుబ్బును మీరేం చేస్తారో నాకు మాట ఇవ్వాలి" అని మీడియాను నిలదీశారు. తాను వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉన్నానని, ఇటీవలే కర్ణాటకలోని శ్రీదత్త యూనివర్సిటీలో ప్రదర్శన ఇచ్చి వచ్చానని, తన ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్స్ చూస్తే తన పని ఏంటో తెలుస్తుందని అన్నారు. అనవసర వివాదాలతో తన సమయాన్ని వృథా చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

అదే సమయంలో, ఈ కేసులోని అసలైన బాధితులకు తాను అండగా ఉంటానని మంగ్లీ స్పష్టం చేశారు. "బాధితులకు పోలీస్ శాఖ తప్పకుండా న్యాయం చేయాలి. నేను కచ్చితంగా వారి పక్షాన నిలబడతాను. కానీ, సంబంధం లేకుండా నా పేరును లాగడం మాత్రం అన్యాయం" అని అన్నారు. ఇకపై ఈ విషయంపై తాము న్యాయపరంగానే ముందుకు వెళతామని, తన న్యాయవాది మిగిలిన విషయాలు చూసుకుంటారని ఆమె తేల్చిచెప్పారు.
Go Back to Shorts
Mangli
Singer Mangli
Subbarao
Big Boss Telugu
Microfinance Scam
Defamation Case
Panjagutta Police
Sreemukhi
Telugu Singer
Mangli Controversy

More Telugu News