రాష్ట్రంలో కాంగ్రెస్ 'దోచుకో-దాచుకో' పథకం నడిపిస్తోంది: కేటీఆర్ తీవ్ర విమర్శలు

KTR Slams Congress Dochuko Dachuko Scheme in Telangana
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ‘దోచుకో-దాచుకో’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించిందని, ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీకి ఎన్నికైన బీఆర్ఎస్ కౌన్సిలర్ల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అంతటి భారీ అవినీతిపరుడైన ముఖ్యమంత్రి దేశంలోనే మరొకరు లేరని ఘాటుగా విమర్శించారు.

కాంగ్రెస్, బీజేపీలు తోడుదొంగల్లా మారి ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని కేటీఆర్ ఆరోపించారు. "సింగరేణిలో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నా, 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉలుకూపలుకూ లేకుండా మౌనంగా ఉంది. దీనిపై సీబీఐ విచారణ జరపాలని కోరినా పట్టించుకోవడం లేదు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి 'ఆర్ఆర్ ట్యాక్స్' వసూలు చేస్తున్నారని విమర్శించారు. 

హోంమంత్రి అమిత్ షా తెలంగాణ కాంగ్రెస్ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. కానీ, ఇప్పటివరకు ఆ ఆరోపణలపై ఎందుకు విచారణకు ఆదేశించలేదు? దీన్నిబట్టి కాంగ్రెస్, బీజేపీలు చీకటి దోస్తులని, ఒకరి అవినీతిని మరొకరు కాపాడుకుంటున్నారని స్పష్టమవుతోంది," అని కేటీఆర్ విమర్శించారు.

సింగరేణిలో ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని, ‘సైట్ విజిటేషన్ సర్టిఫికేట్’ అనే కొత్త విధానంతో కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. వేల కోట్ల కుంభకోణంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్థానిక మంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన వారసత్వ ఉద్యోగాలపై విచారణ జరిపిస్తామని బెదిరించడం కాదని, సృజన్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, అవినీతిని ఆపకపోతే ప్రతి బొగ్గు గనిపైనా అగ్గిపుట్టిస్తామని హెచ్చరించారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 14 స్థానాలు గెలిచినా, మంత్రి వివేక్ ఓటమిని తట్టుకోలేక కౌన్సిలర్లను వేధించారని కేటీఆర్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని, పోలీసులతో భయానక వాతావరణం సృష్టించారని ఆరోపించారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగని తమ పార్టీ కౌన్సిలర్లను అభినందించారు. 

ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో తెలంగాణపై భస్మాసుర హస్తం పెట్టిందని కేటీఆర్ అన్నారు. సింగరేణి కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని, రానున్న యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
Go Back to Shorts
KTR
K Taraka Rama Rao
BRS
Congress Party
Revanth Reddy
Singareni Collieries
Telangana Politics
Corruption Allegations
Bhatti Vikramarka
Balka Suman

More Telugu News