రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం: జగన్
రాజధాని విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన ప్రణాళికతో ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కేడర్ సమావేశంలో పాల్గొన్న ఆయన, అమరావతి ప్రాజెక్టును ఒక 'దోపిడీ గని'గా అభివర్ణిస్తూ 'మావిగన్' ప్రతిపాదనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యమని జగన్ ఆరోపించారు. కేవలం కాంట్రాక్టుల ద్వారా కమీషన్లు దండుకోవడానికే అమరావతిని తెరపైకి తెచ్చారని, ఇది ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. రాజధానికి సంబంధించి ఆయన రెండు ప్లాన్లను సూచించారు.
విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ఉంచడాన్ని మంచి ఆప్షన్ గా చెప్పారు. ఒకవేళ వికేంద్రీకరణ వద్దనుకుంటే... మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కిలోమీటర్ల కారిడార్‌ను (మావిగన్) రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు.
అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు, అందులో కేవలం 10 శాతం పెడితే 'మావిగన్' ప్రాంతంలో అద్భుతమైన మౌలిక వసతులు కల్పించవచ్చని జగన్ వివరించారు. హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో చదరపు అడుగు ధర రూ. 4,500 ఉంటే, అమరావతిలో రూ. 14,000 కట్టబెడుతున్నారని, ఇది అతిపెద్ద దోపిడీ అని ఆయన ధ్వజమెత్తారు. అభివృద్ధి కేవలం ఒకే చోట కేంద్రీకృతం కాకూడదని, అమరావతి వెనుక ఉన్నది కేవలం సంపన్నుల ప్రయోజనాలేనని జగన్ తన కేడర్‌కు వివరించారు.