టర్కీలో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పుల కలకలం... ముగ్గురు సాయుధుల హతం

Israel Consulate Attack in Istanbul 3 Killed
షార్ట్స్‌లో చూడండి
టర్కీలోని ఇస్తాంబుల్‌లో మంగళవారం తీవ్ర కలకలం రేగింది. మూసివున్న ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం వెలుపల పోలీసులకు, దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు దాడి చేసిన వ్యక్తులు హతమయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. బెసిక్తాస్ జిల్లాలోని కాన్సులేట్ భవనం వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా సిఫ్ట్సీ ఈ ఘటనపై స్పందిస్తూ.. పోలీసులతో సాయుధ పోరాటానికి దిగిన ముగ్గురు వ్యక్తులను మట్టుబెట్టినట్లు ధృవీకరించారు. హతమైన ఉగ్రవాదుల వివరాలను గుర్తించినట్లు వెల్లడించారు. వారు ఇజ్మిత్ నుంచి అద్దె వాహనంలో ఇస్తాంబుల్ వచ్చినట్లు తెలిపారు. వీరిలో ఒకరికి మతపరమైన తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని, సోదరులైన ఇద్దరిలో ఒకరికి డ్రగ్స్ కేసులో రికార్డు ఉందని ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు.

ఈ ఘటనపై ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెంటనే దర్యాప్తు ప్రారంభించిందని టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ తెలిపారు. ఒక డిప్యూటీ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కూడిన బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిందని వివరించారు.

ఇస్తాంబుల్ గవర్నర్ దావూత్ గుల్ మాట్లాడుతూ.. సుమారు రెండున్నరేళ్లుగా ఈ కాన్సులేట్ భవనాన్ని దౌత్యపరమైన కార్యకలాపాలకు ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ దౌత్య సిబ్బంది ఎవరూ లేరని ప్రాథమిక అంచనాల్లో తేలింది.
Go Back to Shorts
Turkey Israel Conflict
Israel Consulate Istanbul
Istanbul Shooting
Turkey Terrorist Attack
Mustafa Ciftci
Akin Gurlek
Besiktas
Turkish Police
Consulate Attack
Terrorism

More Telugu News