Perni Nani: తనపై కేసు నమోదు చేసిన పోలీసులపై మరోసారి ఫైర్ అయిన పేర్ని నాని
మచిలీపట్నంలో ఒక ఇంటి కూల్చివేత ఉదంతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టులపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమపై కేసు నమోదు చేయడంపై పేర్ని నాని ఘాటుగా స్పందించారు.
"పోలీసులు మమ్మల్ని ఏకవచనంతో దూషించలేదా? తప్పుడు నాయకులు ఉన్నట్లే, తప్పుడు అధికారులు కూడా ఉంటారు" అని మండిపడ్డారు. జిల్లాలోని 4 వేల మంది అధికారుల్లో 3 వేల మంది నిజాయతీపరులేనని, కానీ కొందరు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. "రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్రులో ఒక సీఐకి పోస్టింగ్ ఇచ్చి, జాయిన్ అవ్వగానే ఎందుకు ఖాళీ చేయించారు?" అని ప్రశ్నించారు.
ప్రభుత్వ తప్పులను నిలదీయడమే తన పని అని పేర్ని నాని స్పష్టం చేశారు. "నన్ను జైలుకు పంపినా సరే, ఇలాగే ప్రశ్నిస్తూనే ఉంటాను. తప్పు చేసిన అధికారిని నిలదీస్తే అందరినీ అన్నట్లు కాదు" అని వివరణ ఇచ్చారు. నిన్నటి గొడవలో పోలీసులు తమతో ప్రవర్తించిన తీరు వల్లే తాము రియాక్ట్ అయ్యామని ఆయన పేర్కొన్నారు.
ఘటన వివరాల్లోకి వెళితే... పట్టణంలోని కొబ్బరితోట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనే సాకుతో ఒక ఇంటిని అధికారులు కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టులపై కేసులు నమోదయ్యాయి. దీనిపై స్పందించిన పేర్ని నాని, కూటమి ప్రభుత్వం, కొందరు అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు.
ఈ క్రమంలో, పోలీసులపై అభ్యంతరకర పదజాలం వాడారన్న ఇనుగుదురుపేట సీఐ పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై బీఎన్ఎస్ 132, 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో పేర్ని నానిపై కూడా కేసు ఫైల్ చేశారు.