ATF Price Hike: జెట్ ఇంధనం ధరల మోత.. భారీగా పెరగనున్న విమాన చార్జీలు!

Aviation Turbine Fuel Price Soars Airline Ticket Prices to Rise
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం విమాన ప్రయాణికులపై పెను భారం మోపనుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఇంధనం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరగడంతో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ‌ జెట్ ఇంధనం ధర ఏకంగా 114.5 శాతం పెరిగి కిలోలీటర్‌కు రూ.2.07 లక్షలకు చేరింది. ఏటీఎఫ్ ధర రూ.2 లక్షల మార్కును దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ప్రభుత్వ రంగ ఇంధన సంస్థల ప్రకటన ప్రకారం ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌పై రూ.1,10,703 మేర పెరిగి రూ.2,07,341కి చేరింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం ఇంధనానికే ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఇంత భారీగా పెరిగిన ధరల భారాన్ని తట్టుకోవడం కంపెనీలకు అసాధ్యం. దీంతో ఈ భారాన్ని ప్రయాణికులపైకి బదిలీ చేసేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. టికెట్ ధరలను భారీగా పెంచడం మినహా వాటికి మరో మార్గం లేదని అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన పశ్చిమాసియా యుద్ధం కారణంగా విమానయాన రంగం ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆ ప్రాంతంలోని గగనతలంలో ఆంక్షలు విధించడంతో చాలా అంతర్జాతీయ విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ఇంధన వినియోగం పెరిగి కంపెనీలపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలోనే గత నెలలో కొన్ని భారత విమానయాన సంస్థలు టికెట్లపై ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను విధించాయి.

ఈ పరిణామాలపై అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (IATA) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ మాట్లాడుతూ... "పశ్చిమాసియాలో యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. కానీ, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో ఇప్పటికే విమాన చార్జీలు పెరుగుతున్నాయి" అని స్పష్టం చేశారు. ధరల పెంపుపై దేశీయ విమానయాన సంస్థల నుంచి తక్షణ స్పందన రానప్పటికీ, త్వరలోనే టికెట్ ధరల పెంపు ప్రకటన వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది.
Go Back to Shorts
ATF Price Hike
Aviation Turbine Fuel
Jet Fuel Price
Airline Ticket Prices
India Aviation
Willy Walsh IATA
West Asia Crisis
Fuel Surcharge
Airlines Fuel Costs

More Telugu News