ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ క్లాసిక్ 350 బైక్ ని 2026 కోసం అప్‌డేట్ చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు కీలకమైన ఫీచర్లను జోడించింది. ప్రధానంగా అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, వేగవంతమైన యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను అమర్చింది.

ఈ అప్‌డేట్‌లో భాగంగా అందించిన అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వల్ల ట్రాఫిక్‌లో క్లచ్ వాడకం తేలికవుతుంది. అలాగే, వేగంగా వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా గేర్లు తగ్గించినప్పుడు వెనుక చక్రం అదుపు తప్పకుండా ఇది నివారిస్తుంది. పాత యూఎస్‌బీ పోర్ట్ స్థానంలో వేగవంతమైన ఛార్జింగ్ కోసం కొత్త టైప్-సి పోర్ట్‌ను కూడా చేర్చారు. అయితే, ఈ కొత్త ఫీచర్లు కేవలం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.

ఈ మార్పులతో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వేరియంట్ల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రూ. 1.95 లక్షలకు పెరిగింది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 2.24 లక్షల వరకు ఉంది. బేస్ మోడల్ అయిన సింగిల్-ఛానల్ ఏబీఎస్ 'రెడ్డిచ్ రెడ్' వేరియంట్ ధరలో (రూ. 1.87 లక్షలు) ఎలాంటి మార్పు లేదు, ఇందులో ఈ కొత్త ఫీచర్లు ఉండవు. ఈ అప్‌డేట్‌లో భాగంగా హల్సియాన్ బ్లాక్, జోధ్‌పూర్ బ్లూ రంగులను నిలిపివేసి, ప్రస్తుతం ఏడు రంగుల్లో ఈ బైక్‌ను అందిస్తోంది.

ఇంజిన్, ఛాసిస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అదే 349సీసీ జే-సిరీస్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ (20.2 హెచ్‌పీ, 27 ఎన్ఎమ్ టార్క్) కొనసాగుతుంది. ఈ అప్‌డేట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ లైనప్‌లో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ లేని ఏకైక మోడల్‌గా బుల్లెట్ 350 ఒక్కటే మిగిలింది.