Mobile Data Usage India: భారత్‌లో సగటు మొబైల్ డేటా వినియోగం ఎంతో తెలుసా?

భారతీయుల మొబైల్ డేటా వినియోగం అంచనాలకు మించి దూసుకుపోతోంది. 2025 నాటికి దేశంలో ఒక్కో వినియోగదారుడి సగటు నెలవారీ డేటా వాడకం 31 జీబీ దాటింది. గత ఐదేళ్లలో ఇది ఏటా సగటున 18 శాతం చొప్పున వృద్ధి చెందింది. ప్రముఖ టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా మంగళవారం విడుదల చేసిన 'మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్' నివేదికలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

దేశంలో 5జీ సేవలు వేగంగా విస్తరించడం, 4కే వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్, ఏఐ ఆధారిత యాప్‌ల వాడకం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. 2025 నాటికి భారతదేశంలో మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్ నెలకు 27 ఎక్సాబైట్లు దాటింది. ఇందులో దాదాపు 47 శాతం వాటా ఒక్క 5జీదే కావడం గమనార్హం. 5జీ డేటా ట్రాఫిక్ ఏకంగా 70 శాతం వృద్ధితో నెలకు 12.9 ఎక్సాబైట్లకు చేరుకుంది.

ప్రస్తుతం మెట్రో నగరాలు 5జీ వినియోగంలో ముందున్నాయి. ఈ నగరాల్లోని మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్‌లో 58 శాతం 5జీ ద్వారానే జరుగుతోంది. అయితే, క్రమంగా చిన్న పట్టణాలకు, ఇతర సర్కిళ్లకు కూడా 5జీ వేగంగా విస్తరిస్తోందని, ఇది కేవలం పట్టణాలకే పరిమితం కాలేదని నివేదిక పేర్కొంది.
ఈ మార్పులో దేశంలోని స్మార్ట్‌ఫోన్ల లభ్యత కూడా కీలక పాత్ర పోషిస్తోంది. 2025 నాటికి దేశంలో 89.2 కోట్ల 4జీ డివైజ్‌లు యాక్టివ్‌గా ఉండగా, వాటిలో 38.3 కోట్లకు పైగా ఫోన్లు 5జీకి సపోర్ట్ చేసేవే. 

అంతేకాకుండా, గతేడాది మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో 90 శాతానికి పైగా 5జీకి మద్దతిచ్చేవి కావడంతో వినియోగదారులు సులభంగా కొత్త టెక్నాలజీకి మారుతున్నారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరిగేకొద్దీ నెట్‌వర్క్‌లపై మరింత భారం పడుతుందని, అందుకు అనుగుణంగా టెలికాం నెట్‌వర్క్‌లు సిద్ధం కావాల్సి ఉంటుందని నోకియా అంచనా వేసింది. 2031 నాటికి భారతదేశంలో 5జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 100 కోట్లు దాటవచ్చని నివేదిక అంచనా వేసింది.
Mobile Data Usage India
Nokia
5G India
4G devices
Smartphone Market India
Mobile Broadband Index
Telecom Networks
AI India
Data Consumption
Internet Users India

More Telugu News