పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్ మోడ్ లో మహానాడు: పల్లా శ్రీనివాసరావు
- ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు
- ఆయిల్ సంక్షోభం, పొదుపు చర్యల కారణంగా నిర్ణయం
- మినీ, పార్లమెంటరీ స్థాయి మహానాడులు రద్దు
- మంగళగిరిలో ముఖ్య నేతలు, క్లస్టర్లలో కార్యకర్తలు
- 1848 కేంద్రాల్లో స్క్రీన్ల ద్వారా వీక్షించే ఏర్పాట్లు
పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మే 27, 28 తేదీల్లో మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో జరపనున్నట్లు పల్లా శ్రీనివాస రావు వివరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి పొలిట్‌బ్యూరో, రాష్ట్ర స్థాయి సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలిపారు. అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా 1,848 క్లస్టర్ల వద్ద ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్ వద్ద సుమారు 500 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ పొదుపు చర్యల్లో భాగంగా, మే 18, 19, 20 తేదీల్లో జరగాల్సిన మినీ మహానాడులతో పాటు, 23, 24 తేదీల్లోని పార్లమెంట్ స్థాయి మహానాడులను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నాయకులు, కార్యకర్తలు స్వాగతించాలని కోరారు.