జీమెయిల్ ఉచిత స్టోరేజ్‌లో కొత్త మెలిక.. స్పందించిన గూగుల్!

Google Gmail new storage policy sparks debate
  • కొత్త జీమెయిల్ ఖాతాలకు 5GB స్టోరేజ్ మాత్రమే!
  • 15GB పూర్తి స్టోరేజ్ కోసం ఫోన్ నంబర్ తప్పనిసరి!
  • ఇది కేవలం ఓ ప్రయోగం మాత్రమేనని స్పష్టం చేసిన గూగుల్
  • ఖాతా భద్రత మెరుగుపరచడమే లక్ష్యమని వెల్లడి
  • ప్రస్తుత ఖాతాలపై ఎలాంటి ప్రభావం ఉండదని అంచనా
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన జీమెయిల్ సేవల్లో కీలక మార్పును పరీక్షిస్తోంది. కొత్తగా జీమెయిల్ ఖాతా తెరిచే వారికి ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న 15జీబీ స్టోరేజ్ స్థానంలో కేవలం 5జీబీ మాత్రమే ఇవ్వాలని యోచిస్తోంది. పూర్తి 15జీబీ స్టోరేజ్ పొందాలంటే తమ ఫోన్ నంబర్‌ను ఖాతాకు జోడించాలనే షరతు విధిస్తోంది.

ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో గూగుల్ స్పందించింది. "ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో కొత్త ఖాతాల కోసం ఈ కొత్త స్టోరేజ్ విధానాన్ని పరీక్షిస్తున్నాం. మా యూజర్లకు నాణ్యమైన సేవలను అందించడంతో పాటు, ఖాతా భద్రతను, డేటా రికవరీని మెరుగుపరచడమే దీని ఉద్దేశం" అని గూగుల్ ప్రతినిధి తెలిపారు. ఫోన్ నంబర్‌ను జోడించడం ద్వారా ఖాతా భద్రతను పెంచాలని వినియోగదారులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని సంస్థ పేర్కొంది.

ఈ మార్పును మొదట ఓ రెడ్డిట్ యూజర్ గుర్తించారు. కొత్తగా జీమెయిల్ ఖాతా తెరిచినప్పుడు తనకు 5జీబీ మాత్రమే వచ్చినట్లు, ఫోన్ నంబర్ జోడిస్తే 15జీబీకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని చూపిస్తున్న స్క్రీన్‌షాట్‌ను ఆయన షేర్ చేశారు. దీంతో యూజర్ల మధ్య చర్చ మొదలైంది.

ప్రస్తుతానికి ఇది ప్రపంచవ్యాప్త మార్పు కాదని, కేవలం కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ప్రయోగాత్మక పరిశీలన అని తెలుస్తోంది. గూగుల్ సపోర్ట్ పేజీల్లో ఇప్పటికీ ప్రతి ఖాతాకు 15జీబీ ఉచిత స్టోరేజ్ లభిస్తుందని పేర్కొంది. కాబట్టి, ఇప్పటికే జీమెయిల్ ఖాతాలు ఉన్నవారికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, వారి 15జీబీ స్టోరేజ్‌కు ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదని నిపుణులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Google
Gmail
Gmail storage
Google storage
Free storage
Data privacy
Account security
Phone number verification
Google account

More Telugu News