పొరుగు రాష్ట్రం నేతతో నన్ను పోల్చవద్దు.. అండగా ఉంటానన్న నేతలు ఆ రోజు పారిపోయారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan on Health Challenges and Political Future
  • మంగళగిరిలో జనసేన ఉద్యమి సమావేశం
  • శస్త్రచికిత్స తర్వాత తొలిసారిగా సమావేశానికి విచ్చేసిన పవన్ 
  • జనసేన క్యాడర్ కు దిశానిర్దేశం
  • 2019లో తనను రెండు చోట్లా ఓడించారని వెల్లడి
ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కోలుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన 'జనసేన ఉద్యమి' సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, గడిచిన కొన్నేళ్లలో తాను ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తొలిసారిగా వెల్లడించారు. గత ఎన్నికల్లో విజయం తన ఒక్కడిది కాదని, క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పనిచేసిన ప్రతి జనసైనికుడు, వీరమహిళ, ఉద్యమిదేనని స్పష్టం చేశారు. పార్టీ భవిష్యత్ నిర్మాణం, భావజాల వ్యాప్తి, ప్రభుత్వంలో జనసేన పాత్ర వంటి కీలక అంశాలపై కార్యకర్తలకు సుదీర్ఘంగా వివరించారు.

ఆరోగ్య సమస్యలపై తొలిసారిగా స్పందన

గత కొన్నేళ్లుగా తాను తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాటం చేశానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. "ఎన్నికలకు ఏడాది ముందు నుంచి ప్రచారంలో తిరగడం, కరోనా సమయంలో లంగ్ ఇన్ఫెక్షన్ రావడంతో నా ఆరోగ్యం దెబ్బతింది. ఆ ఇన్ఫెక్షన్ ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదు. దుమ్ము, ధూళిలో తిరగడం వల్ల సైనస్ ప్రాంతంలో దుమ్ము పేరుకుపోయి గట్టిపడిపోయింది. దీనివల్ల నా గొంతు కూడా చాలాకాలం ఇబ్బంది పెట్టింది. ఒక దశలో కంటి చూపులో కూడా తేడా వచ్చింది. భీమవరంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లి చికిత్స తీసుకోవడానికి నెల రోజులు పట్టింది," అని వివరించారు.

అభిమానుల ప్రేమ వల్లే తన భుజాలకు గాయాలయ్యాయని పవన్ భావోద్వేగంతో తెలిపారు. "నా రెండు భుజాల్లో కండరాలు తెగిపోయాయి (టేర్). ఎలా జరిగిందని వైద్యులు అడిగితే, మా వాళ్లు ప్రేమతో లాగేశారు అని చెప్పాను. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అభిమానులు ప్రేమతో గట్టిగా లాగడంతో కండరాలు తెగిపోయాయి. మీ ప్రేమతో తెగిన కండరాలను మళ్లీ మీ ప్రేమే బాగుచేస్తుంది," అని అన్నారు. వెన్నెముకలో కూడా 10 నుంచి 11 చోట్ల కంప్రెషన్స్ ఉన్నాయని, క్రీడా నేపథ్యం ఉండటంతో ఆ నొప్పిని తట్టుకోగలుగుతున్నానని తెలిపారు. "లోపల ఎంత నొప్పి ఉందో నాకే తెలియదు. నా పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ. అయినా మీ అందరి ఆశీస్సులతో నేను బాగుంటాను" అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

నన్ను ఇతరులతో పోల్చవద్దు

తమిళనాడులో విజయ్ సాధించిన విజయంతో తనను పోల్చవద్దని పవన్ కల్యాణ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. "పొరుగు రాష్ట్ర నేతలా మీరు కూడా చేసి ఉండాల్సింది అని చాలామంది సందేశాలు పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. అదే పని 2019లో చేస్తే రెండుచోట్లా ఓడించారు కదా అండగా ఉంటానన్న నాయకులంతా ఆ రోజు పారిపోయారు. నాకు పదవి ముఖ్యం అనుకుంటే 2008లోనే ఎంపీగా పోటీ చేసేవాడిని, 2014లోనూ అవకాశం వచ్చింది. కానీ నాకు పార్టీని నిర్మించడం ముఖ్యం" అని స్పష్టం చేశారు.

భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత

రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ నాలుగు కీలక అంశాలను ప్రస్తావించారు.
1.పార్టీ నిర్మాణం: "ఒక పుష్కర కాలం (12 సంవత్సరాలు) తర్వాత పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయాల్సిన సమయం వచ్చింది. ఇన్నాళ్లూ సిద్ధాంతాన్ని నమ్మి, ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని నిలబడిన మీరే ఈ పార్టీకి పునాది. మిమ్మల్ని కేంద్రంగా చేసుకునే కొత్త నిర్మాణం ఉంటుంది" అని తెలిపారు.
2.భావజాలం: జనసేన ఏడు సిద్ధాంతాలను కార్యకర్తలు క్షుణ్ణంగా అర్థం చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
3.పొత్తు ధర్మం, భవిష్యత్ మార్గం: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర ఎలా ఉండబోతోందో వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపైనా స్పష్టత ఇచ్చారు.
4.జాతీయ స్థాయిలో పాత్ర: ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా జనసేన ఎలా ముందుకు సాగాలో, ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను ఎలా సమన్వయం చేసుకోవాలో వివరిస్తానని చెప్పారు.

క్షేత్రస్థాయి నాయకులే పార్టీ బలం

పార్టీ బలం తాను కాదని, క్షేత్రస్థాయిలోని కార్యకర్తలేనని పవన్ పునరుద్ఘాటించారు. "ఒకప్పుడు 150 మందితో మొదలైన పార్టీలో ఇప్పుడు 21.5 లక్షల మంది జనసైనికులు, వీరమహిళలు ఉన్నారు. మిమ్మల్ని 'సాధకులు' అని పిలవాలనుకుంటున్నాను. లక్ష్యాన్ని సాధించేవారే సాధకులు. 'మా ఊరికి నేనే పవన్ కల్యాణ్' అని వైజాగ్‌లో ఒక జనసైనికుడు చెప్పినప్పుడు, నేను కోరుకున్న పార్టీ నిర్మాణం ఇదే అనిపించింది," అని అన్నారు. విజయనగరంలో 'మంగళవారం హుసేన్', నక్సలిజం వీడి ఉపసర్పంచ్ అయిన అరకు యువకుడు బాబూరావు వంటి ఎందరో స్ఫూర్తిదాయక కార్యకర్తలే జనసేన నిజమైన బలమని కొనియాడారు.

"ఈ విజయం ఉమ్మడి పోరాటం వల్లే సాధ్యమైంది. ఈ గెలుపులో నాకు ఎంత వాటా ఉందో, మీ అందరికీ అంతే సమానమైన వాటా ఉంది. మీరంతా లేకపోతే నేను ఎవరిని ప్రేమిస్తాను? నన్ను వీడని నా జనసైనికులు, వీరమహిళలే నా బలం" అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కూడా జనసేన ప్రతినిధులు హాజరయ్యారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
AP Politics
Andhra Pradesh
Health Issues
Political Challenges
Party Cadre
Future Plans
TDP BJP Alliance
Mangalagiri

More Telugu News