Chandrababu Naidu: ఆ బాధ్యతను లోకేశ్ కు అప్పగిస్తున్నా: సీఎం చంద్రబాబు

Chandrababu Focuses on Party Workers Welfare at TDP Event
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాది అని, వారిని నిర్లక్ష్యం చేసే నాయకులను తాను ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. "కార్యకర్తలను దూరంగా ఉంచే నేతలను నేను దూరంగా ఉంచుతా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే నాయకులు మాకు అవసరం లేదు" అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈసారి వినూత్నంగా వేదికపై కార్యకర్తలను కూర్చోబెట్టి, సీనియర్ నేతలు సభికుల్లో కూర్చోవడం ద్వారా 'కార్యకర్తే అధినేత' అనే నినాదానికి ఆచరణాత్మక రూపాన్ని ఇచ్చారు.

ఎవరు బాగా పనిచేస్తే వారే ప్రజాప్రతినిధులు అవుతారు 

భవిష్యత్తులో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులు వస్తాయని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. "రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా 50 శాతం సీట్లు పెరగనున్నాయి. 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. పార్టీ కోసం ఎవరు బాగా పనిచేస్తే వారే ప్రజాప్రతినిధులవుతారు. క్రమశిక్షణతో పనిచేసి పార్టీని బలోపేతం చేయండి" అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను, నేతలను గుర్తించే కీలక బాధ్యతను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు అప్పగిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వ్యక్తిగత ప్రవర్తన నుంచి ప్రతి అంశంలోనూ పార్టీ బ్రాండ్‌ను నిలిపేలా ఆదర్శంగా ఉండాలని సూచించారు.

చరిత్ర, వర్తమానం, భవిష్యత్ టీడీపీదే

తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. "టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రతి అడుగూ సంచలనమే, ప్రతి నిర్ణయమూ ప్రజాక్షేమమే. నాడు ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా బర్తరఫ్ చేస్తే, ప్రజలే రోడ్లపైకి వచ్చి ఉద్యమించి తిరిగి అధికారాన్ని కట్టబెట్టారు. 40 ఏళ్ల క్రితం టీడీపీ తెచ్చిన రూ.2కే కిలో బియ్యం పథకమే నేటి జాతీయ ఆహార భద్రతా చట్టానికి స్ఫూర్తి. మహిళలకు ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వంటివి మనమే దేశానికి పరిచయం చేశాం. డ్వాక్రా సంఘాలతో మహిళా సాధికారతకు బాటలు వేశాం. బీసీలకు రాజ్యాధికారం, ఎస్సీలకు వర్గీకరణ, ఎస్టీలు, మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశాం" అని వివరించారు.

టీడీపీని ఫినిష్ చేస్తామన్నారు... వాళ్లే ఫినిష్ అయ్యారు

పార్టీ ప్రస్థానంలో ఎన్నో సంక్షోభాలను, సవాళ్లను ఎదుర్కొన్నామని చంద్రబాబు అన్నారు. "టీడీపీని ఫినిష్ చేస్తామన్న వారే ఫినిష్ అయ్యారు. ఎంతోమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. నాపై అలిపిరిలో హత్యాయత్నం జరిగింది. 2019-24 మధ్య కాలంలో నన్ను కూడా అక్రమంగా జైల్లో పెట్టారు. గత ప్రభుత్వ విధ్వంసంపై లోకేశ్ యువగళం పాదయాత్రను అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా కార్యకర్తల అండతోనే ముందుకు సాగాం. ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి ఈ అధికారం అంతా కార్యకర్తల త్యాగాల ఫలితమే" అని భావోద్వేగంగా ప్రసంగించారు. చంద్రయ్య అనే కార్యకర్త త్యాగాన్ని గుర్తుపెట్టుకుని, ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

‘సూపర్ సిక్స్’తో సంక్షేమ పాలన

2024 ఎన్నికల్లో బీజేపీ-జనసేనతో కలిసి చారిత్రక విజయం సాధించామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా పాలన అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. "సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్‌ చేశాం. దేశంలోనే ఎవరూ ఇవ్వని విధంగా రూ.4,000 సామాజిక పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం, స్త్రీ శక్తి వంటి పథకాలను అమలు చేస్తున్నాం. డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ చేపట్టాం. తాజాగా 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. చెప్పినట్టుగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా పరిశ్రమలను ఆకర్షిస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి, నిలబెట్టుకున్నాం. ఈ ఏడాది కూడా పెంచం, భవిష్యత్తులోనూ పెంచబోం" అని స్పష్టం చేశారు.

ఒకే రాజధాని.. అభివృద్ధి ప్రణాళిక

రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికపై చంద్రబాబు స్పష్టతనిచ్చారు. "పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. అమరావతిలో గతంలో ప్రారంభించిన పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తాం. అమరావతి దేవతల రాజధాని కాబట్టి కొందరు రాక్షసులకు ఇష్టం లేదు. ఇక మూడు ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి" అని పునరుద్ఘాటించారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ, వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

వేదికపై కార్యకర్తలు.. సరికొత్త పంథా

ఈసారి ఆవిర్భావ దినోత్సవ సభలో ఒక ప్రత్యేకత చోటుచేసుకుంది. ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తూ, పార్టీ కోసం కష్టపడిన 19 మంది సామాన్య కార్యకర్తలను వేదికపై ఆసీనులను చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ నాయకులు సభికుల మధ్య కూర్చున్నారు. సభా నిర్వహణ బాధ్యతలను యువ నాయకురాలు కావలి గ్రీష్మకు అప్పగించారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల నుంచి టీడీపీ నేతలు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అంతకుముందు, చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీ బలోపేతానికి పునరంకితమవుతామని కార్యకర్తలతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
TDP
Nara Lokesh
Telugu Desam Party
AP Politics
Andhra Pradesh
Amaravati
Super Six Schemes
TDP Formation Day
Political News

More Telugu News