Chandrababu Naidu: మొక్కజొన్న రైతుల కోసం కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి

Chandrababu Naidu Writes to Center for Maize Farmers Support
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోవడంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆయన లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది రబీలో రికార్డు స్థాయిలో సుమారు 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైందని, దీనివల్ల ఉత్పత్తి పెరిగి ధరలు పతనమయ్యాయని వివరించారు. క్వింటాల్‌కు రూ.2,400 కనీస మద్దతు ధర ఉండగా, మార్కెట్‌లో కేవలం రూ.1,500 నుంచి రూ.1,700 మాత్రమే లభిస్తోందని, దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

మంత్రి నివేదికపై స్పందించిన చంద్రబాబు, రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఏపీకి ప్రత్యేకంగా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ పథకాన్ని అమలు చేయాలని లేఖలో కోరారు. ఈ పథకం కింద అయ్యే నష్టాన్ని పూర్తిగా (100శాతం) కేంద్ర ప్రభుత్వమే భరించాలని, మొత్తం ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు ఆర్థికంగా ఊరట లభిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
 
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Maize farmers
Minimum Support Price
Shivraj Singh Chouhan
Price Deficiency Payment Scheme
Achchennaidu
Corn farmers Andhra Pradesh
AP farmers
Agricultural crisis

More Telugu News