Kamal Haasan: రాజకీయాల్లో చిరంజీవి సీనియర్.. సినిమాల్లో జూనియర్: కమల్ హాసన్

Kamal Haasan Says Chiranjeevi is Senior in Politics Junior in Films
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవిని తన సోదరుడిగా అభివర్ణిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చిరంజీవి తనకంటే సీనియర్ అని, సినిమాలలో మాత్రం జూనియర్ అని సరదాగా వ్యాఖ్యానించి సభలో నవ్వులు పూయించారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేదికపై కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మక పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నటుడు నాగార్జున చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ప్రకటించిన బీఎన్ రెడ్డి అవార్డును ఆయన తరఫున స్వీకరించారు.  

అవార్డు స్వీకరించిన అనంతరం కమల్ హాసన్ మాట్లాడుతూ, ప్రేక్షకుల మధ్య కూర్చున్న చిరంజీవిని ఉద్దేశించి, "చిరంజీవి గారు, నేను సోదరులం. ఆయన రాజకీయాల్లో నాకు సీనియర్, సినిమాలలో నాకు జూనియర్. మేమిద్దరం 70వ దశకంలోనే కథానాయకులుగా మారాం" అని అన్నారు. తెలుగు నటీనటులంతా తన కుటుంబ సభ్యులేనని, గతంలో చెన్నైలో ఉన్న పరిశ్రమ ఇప్పుడు హైదరాబాద్‌కు ఇల్లు మారిందని, తన దృష్టిలో మాత్రం ఇదంతా ఒకే పరిశ్రమ అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేశారు. "ఇకపై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్ వంటి హద్దులు వద్దు. మనదంతా ఒకే సినిమా, అదే ఇండియన్ సినిమా. ఈ ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసే గొప్ప కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు. దీనికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. భవిష్యత్ తరాలను ముందుకు నడిపే ఈ పల్లకీకి మా భుజాలను అందిస్తాం" అని కమల్ హాసన్ అన్నారు.

విప్లవ కవి గద్దర్ పేరు మీద ఈ అవార్డులను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. "గద్దర్ గారి పేరు మీద ఈ అవార్డును నెలకొల్పడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకున్న లక్షలాది మంది అభిమానుల్లో నేనూ ఒకడిని" అని కమల్ పేర్కొన్నారు. తాను ఏఎన్నార్ గారి 'శ్రీమంతుడు' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడానికి తొలిసారి హైదరాబాద్ వచ్చానని గుర్తు చేసుకున్నారు. 

తన 'దశావతారం' సినిమాలో 'ఎంతో చిన్నది జీవితం' అనే పాట ఉండటానికి కూడా తెలుగుతో తనకున్న అనుబంధమే కారణమని వివరించారు. ఇక సింగీతం తరఫున అవార్డు అందుకోవడం గురించి చెబుతూ, తాను తొలిసారి ఆయన దర్శకత్వంలో నటించిన 'సొమ్మొకడిది- సోకొకడిది' సినిమా నాటి రోజులు ఈ క్షణంలో గుర్తుకు వస్తున్నాయని అన్నారు. తన సినీ గురువు సింగీతం శ్రీనివాసరావుతో కలిసి 50 ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఆయన తన సినీ కెరీర్‌లో కలిసిన అత్యంత యువ సీనియర్ అని కమల్ ప్రశంసించారు. భారతీయ సినిమాకు ఆరు దశాబ్దాలుగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు.
Go Back to Shorts
Kamal Haasan
Chiranjeevi
Telangana Gaddar Film Awards 2025
Revanth Reddy
Tollywood
Indian Cinema
Telugu Film Industry
Singitham Srinivasa Rao
పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు

More Telugu News