Harish Shankar: ఇంత కంటెంట్ ఉంటుందని ఊహించలేదంటున్నారు: 'ఉస్తాద్ భగత్ సింగ్' సక్సెస్ మీట్ లో హరీశ్ శంకర్

Ustaad Bhagat Singh Harish Shankar talks about movie content
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచవ్యాప్తంగా 'ఉస్తాద్ భగత్ సింగ్'కు పాజిటివ్ రివ్యూస్ వస్తుండడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉగాది పండగ కానుకగా నేడు (మార్చి 19న) విడుదలైన ఈ చిత్రం, తొలి షో నుంచే ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. 

ముఖ్యంగా, హరీశ్ శంకర్ ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ను చూపించిన విధానానికి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం ఫ్యాన్సే కాకుండా, సాధారణ ప్రేక్షకులు, కుటుంబ ప్రేక్షకులు కూడా సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇందులో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండటం విశేషం. ఊహించిన దానికంటే గొప్ప స్పందన వస్తుండటంతో చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి, తమ ఆనందాన్ని పంచుకుంది.

వింటేజ్ పవన్‌తో పాటు అర్థవంతమైన అంశాలు జోడించాం: డైరెక్టర్ హరీష్ శంకర్

ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, "ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఇది ఒక మాస్ ఎంటర్‌టైనర్ కాబట్టి, ఓవర్సీస్ నుంచి పాజిటివ్ టాక్ రావడానికి కొంత సమయం పడుతుందని భావించాను. కానీ తొలి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను డిజైన్ చేశాం. సినిమా చూసిన చాలామంది, ఇందులో ఇంత కంటెంట్ ఉంటుందని ఊహించలేదని ఆశ్చర్యపోతున్నారు. మొదటి రోజు నుంచి నేను చెప్పింది ఒకటే. ఇది ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్, వింటేజ్ పవన్ కల్యాణ్ గారిని చూపిస్తానని చెప్పాను, ఆ మాట నిలబెట్టుకున్నాం. 

కమర్షియల్ సినిమా అయినప్పటికీ, కొన్ని అర్థవంతమైన అంశాలను చేర్చాం. ముఖ్యంగా, తెలుగు సినిమాలో ఇప్పటివరకు ఎక్కువగా చర్చించని అక్రమ వలసదారుల అంశాన్ని స్పృశించాం. సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది, అన్ని పాత్రలు అద్భుతంగా వచ్చాయి. ప్రేక్షకులు ప్రతి పాత్రతో కనెక్ట్ అవుతున్నారు. ‘అన్నా, సినిమా అద్భుతంగా ఉంది’ అని ఫ్యాన్స్ ఫోన్లు చేసి చెబుతున్నారు. రెండో భాగంలో వచ్చే ‘తొలిప్రేమ’ పాట వినియోగానికి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇన్ని అంశాలున్న సినిమాకు, అతి తక్కువ సమయంలో తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమా మా టీమ్ అందరి సమష్టి కృషి ఫలితం" అని వివరించారు.

షో షోకి టాక్, కలెక్షన్లు పెరుగుతున్నాయి: నిర్మాత నవీన్ యెర్నేని

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమెరికా అనే తేడా లేకుండా అన్నిచోట్లా తొలి షో నుంచే నమ్మశక్యంకాని రెస్పాన్స్ వస్తోంది. మేం విమల్ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాం. సినిమా అంతా థియేటర్‌లో పండగ వాతావరణం కనిపించింది. ప్రజలు సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశారు. ప్రతి షోకి టాక్, కలెక్షన్లు పెరుగుతున్నాయి. మేం ఊహించిన దానికంటే గొప్ప స్పందన ఇది, చాలా సంతోషంగా ఉంది. 

'ఉస్తాద్ భగత్ సింగ్'కు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా సినిమా చూడని వారు తప్పకుండా థియేటర్లకు వెళ్లి చూడండి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సంపూర్ణ కుటుంబ కథా చిత్రం. పవన్ కల్యాణ్ గారు వన్ మ్యాన్ షో చేశారు. 'గబ్బర్ సింగ్'ను మించేలా హరీశ్ శంకర్ బాధ్యతగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కచ్చితంగా లాంగ్ రన్ ఆడి, భారీ కలెక్షన్లు సాధిస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ గారితో సినిమా మా కల: నిర్మాత వై. రవిశంకర్

మరో నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ, "పవన్ కల్యాణ్ గారితో సినిమా చేయడం ఎప్పటినుంచో మా కల. ఆ కల నెరవేరడమే కాకుండా, సినిమా ఇంత పెద్ద హిట్ కావడం మాకు డబుల్ బొనాంజాగా అనిపిస్తోంది. షో షోకి టాక్ మరింత బలపడుతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా. చాలా కాలం తర్వాత ఒక పెద్ద స్టార్ నుంచి సరైన కమర్షియల్ ఫార్మాట్‌లో అన్ని అంశాలతో వచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి ప్రతీ షోకి కలెక్షన్లు పెరుగుతున్నాయని ఆనందంగా చెబుతున్నారు" అని అన్నారు.

మొత్తం మీద, పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, హరీశ్ శంకర్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, తమన్ నేపథ్య సంగీతం కలగలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. చిత్ర బృందం వ్యక్తం చేస్తున్న ఆనందం, ధీమా చూస్తుంటే ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Go Back to Shorts
Harish Shankar
Ustaad Bhagat Singh
Pawan Kalyan
Naveen Yerneni
Y Ravi Shankar
Mythri Movie Makers
Telugu movie review
Gabbar Singh
Telugu cinema
Box office collection

More Telugu News