AB de Villiers: ఆర్సీబీకి గుండెకాయ విరాట్ కోహ్లీనే: ఏబీ డివిలియర్స్

Virat definitely is still the heartbeat of RCB says AB de Villiers
షార్ట్స్‌లో చూడండి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీకి భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీయే మూలస్తంభమని, అతడే జట్టుకు గుండెకాయ వంటివాడని ఆ జట్టు మాజీ సూపర్‌స్టార్ ఏబీ డివిలియర్స్ ప్రశంసించాడు. కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా మైదానంలో అతను కనబరిచే ఉత్సాహం, నాయకత్వ పటిమ జట్టుకు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాడు. గతేడాది ఐపీఎల్ లో తొలిసారిగా ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన ఆర్సీబీ, ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ డివిలియర్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "సంవత్సరాలుగా బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడమే కాదు, తన ఉనికితో, ఎనర్జీతో జట్టుకు విరాట్ ఇప్పటికీ ప్రాణం పోస్తున్నాడు. జట్టు గెలుపు కోసం మైదానంలోనూ, వెలుపలా అతను పోరాడే తీరు ప్రశంసనీయం. అతని ఉత్సాహం యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతుంది. మనం కచ్చితంగా ట్రోఫీ గెలవగలం అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. గతేడాది ఆర్సీబీ విజయంలో ఇదే కీలకపాత్ర పోషించింది" అని డివిలియర్స్ తెలిపాడు.

గత సీజన్‌లో ఆర్సీబీ ప్రదర్శనను ఏబీడీ విశ్లేషించాడు. "గతంలో ఆర్సీబీ ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడేది. కానీ, గత సీజన్‌లో ఆ పరిస్థితి మారింది. జట్టు మొత్తం సమష్టిగా రాణించింది. కోహ్లీ ఓపెనర్‌గా ప్రధాన స్కోరర్లలో ఒకడిగా ఉన్నప్పటికీ, మిగతా ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకున్నారు. ఫైనల్ మ్యాచే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు. కానీ, రజత్ పాటిదార్, లివింగ్‌స్టోన్, జితేశ్‌ శర్మ, రొమారియో షెపర్డ్ వంటి వారు వేగంగా ఆడి జట్టు స్కోరును 190 దాటించారు. కృనాల్ పాండ్యా బంతితో రాణించాడు" అని గుర్తుచేశాడు.

ఈ సమష్టి కృషే కోహ్లీకి అదనపు బలమని డివిలియర్స్ పేర్కొన్నాడు. "జట్టు భారాన్ని ఇకపై తానొక్కడినే మోయాల్సిన అవసరం లేదనే భావన కోహ్లీలో కలిగింది. తన చుట్టూ ట్రోఫీ గెలవాలనే కసి ఉన్న ఫైటర్స్ ఉన్నారని అతను నమ్ముతున్నాడు. అందుకే ఆర్సీబీ ఇప్పుడు చాలా పటిష్ఠంగా ఉంది. దాదాపు పాత జట్టుతోనే బరిలోకి దిగుతుండటంతో ఈ సీజన్‌లోనూ టైటిల్ గెలిచే సత్తా వారికి ఉందని నేను నమ్ముతున్నాను" అని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ఐపీఎల్ 2026 సీజన్‌ను ఆర్సీబీ ఈ నెల‌ 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది.
Go Back to Shorts
AB de Villiers
Virat Kohli
RCB
Royal Challengers Bangalore
IPL 2026
Indian Premier League
Cricket
Rajat Patidar
Sunrisers Hyderabad
Chinnaswamy Stadium

More Telugu News