పన్నుల వసూళ్లలో దూసుకెళుతోన్న భారత్‌.. రూ.8.11 లక్షల కోట్లకు చేరిన డైరెక్ట్‌ ట్యాక్స్‌

Direct Tax Collection In India Records Massive 23 Percent Growth
  • గత ఏడాదితో పోలిస్తే 23.09 శాతం వృద్ధి
  • స్థూల పన్ను వసూళ్లు రూ.9.55 లక్షల కోట్లు
  • కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రూ.2.70 లక్షల కోట్లు
  • కార్పొరేటేతర పన్నులు రూ.5.07 లక్షల కోట్లు
  • ఎస్‌టీటీ వసూళ్లు రూ.33,823 కోట్లకు పెరుగుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఆగస్టు 10 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇవి 23.09 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది.

రిఫండ్‌లకు ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.55 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో 19.75 శాతం వృద్ధి కనిపించింది. ఇదే సమయంలో పన్ను చెల్లింపుదారులకు రూ.1.43 లక్షల కోట్ల రిఫండ్‌లు జారీ చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.79 శాతం ఎక్కువ.

కార్పొరేట్‌ పన్నుల రూపంలో నికర వసూళ్లు రూ.2.70 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.2.26 లక్షల కోట్లుగా ఉన్నాయి. కార్పొరేటేతర పన్నుల వసూళ్లు రూ.5.07 లక్షల కోట్లకు పెరిగాయి. గత ఏడాది ఇవి రూ.4.11 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

షేర్ల కొనుగోలు, అమ్మకాలపై విధించే సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ) వసూళ్లలోనూ భారీ పెరుగుదల నమోదైంది. ఇవి రూ.33,823 కోట్లకు చేరగా, గత ఏడాది ఇదే కాలంలో రూ.22,354 కోట్లుగా ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కేంద్ర ఆర్థిక లోటు రూ.3.1 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో 18.2 శాతానికి సమానమని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) వెల్లడించింది.
Advertisement
India Direct Tax
Direct Tax Collection
Income Tax India
Corporate Tax Revenue
Securities Transaction Tax
Indian Economy News

More Telugu News