శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 1300 మంది పోలీసులతో కీలక భేటీ

CM Chandrababu review on law and order key meeting with 1300 police officers
  • రేపు శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
  • డీజీపీ నుంచి ఎస్‌హెచ్‌ఓ వరకు 1300 మంది అధికారులతో సమావేశం
  • గంజాయి, సైబర్ క్రైమ్‌, మహిళలపై నేరాల కట్టడిపై ప్రధానంగా చర్చ
  • పోలీస్ స్టేషన్ల పనితీరుపై నివేదికలతో సమీక్షించనున్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సచివాలయంలో కీలకమైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ చరిత్రలోనే అరుదుగా, డీజీపీ స్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) వరకు సుమారు 1,300 మంది అధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతుండటం గమనార్హం.

ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని శాంతిభద్రతలు, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాలు, గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్‌ల అరాచకాలకు అడ్డుకట్ట వేయడం వంటి కీలక అంశాలపై చంద్రబాబు చర్చించనున్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరుపై తన వద్ద ఉన్న క్షేత్రస్థాయి నివేదికలను అధికారుల ముందుంచి, ఆయన సమగ్రంగా విశ్లేషించనున్నారు. వివిధ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, శాంతిభద్రతల పర్యవేక్షణ తీరుతెన్నులపై ముఖ్యమంత్రి నేరుగా సమీక్ష నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, చట్టాన్ని అతిక్రమించే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీన వర్గాల రక్షణకే అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరవుతుండగా, జిల్లా స్థాయి అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Law and Order
AP Police Review Meeting
DGP Andhra Pradesh
Crime Control AP

More Telugu News