Maruti Suzuki's Dzire: భారత మార్కెట్లో మారుతి డిజైర్ సరికొత్త రికార్డ్

Maruti Suzukis Dzire crosses 3 million sales in India
  • 30 లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన మారుతి డిజైర్
  • 2025లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు
  • కొనుగోలుదారులలో 50 శాతం మంది యువత, తొలిసారి కార్ల ఓనర్లే
  • భారత్, గ్లోబల్ ఎన్‌క్యాప్‌లలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మోడల్
  • సెడాన్ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న డిజైర్
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) తమ పాప్యులర్ సెడాన్ 'డిజైర్' (Dzire) అమ్మకాలలో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నట్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్లో ఈ కారు అమ్మకాలు 30 లక్షల యూనిట్లను దాటాయని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన కార్లలో డిజైర్ ఒకటిగా నిలుస్తోంది.

2025 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా డిజైర్ నిలిచిందని, సెడాన్ విభాగంలో ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని మారుతి సుజుకి పేర్కొంది. 2008లో తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన ఈ కారు, ఇప్పటివరకు నాలుగు జనరేషన్ల అప్‌గ్రేడ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. "ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడంపై 30 లక్షల మంది డిజైర్ కస్టమర్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాలుగో తరం డిజైర్ తన అధునాతన లుక్స్‌తో సెడాన్ సెగ్మెంట్‌కు కొత్త ఊపునిచ్చింది. కొనుగోలుదారుల్లో దాదాపు 50 శాతం మంది యువత, తొలిసారి కారు కొనేవారే ఉండటం దీనికి ఉన్న ఆదరణకు నిదర్శనం" అని తెలిపారు. 

మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అనేక ఫీచర్లతో పాటు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా డిజైర్ విజయానికి కారణమని బెనర్జీ తెలిపారు. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP), గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) రెండింటిలోనూ ఈ మోడల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం విశేషం. ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AGS), ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి అధునాతన ఫీచర్లను అందిస్తూ ఈ కారు మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో మారుతి సుజుకి అమ్మకాల్లో 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. 
Maruti Suzuki's Dzire
Maruti Dzire
Maruti Suzuki
Dzire sales record
Sedan cars India
Automobile industry
Partho Banerjee
Bharat NCAP
Global NCAP
Car sales India
Compact sedan

More Telugu News