Indian Students in Iran: ఇరాన్‌లో ఉద్రిక్తతలు... టెహ్రాన్ నుంచి భారత విద్యార్థుల తరలింపు

Indian Students in Iran Evacuated from Tehran Amid Tensions
  • టెహ్రాన్ నుంచి ఖోమ్ నగరానికి భారత విద్యార్థుల తరలింపు
  • భారత ఎంబసీ ప్రత్యేక బస్సుల్లో తరలించినట్లు జేకేఎస్‌ఏ వెల్లడి
  • ప్రస్తుతం విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టీకరణ
  • గగనతలం తెరుచుకోగానే భారత్‌కు రప్పించే యోచనలో కేంద్రం
  • తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరిన విద్యార్థి సంఘం
ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, వరుస వైమానిక దాడుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థుల భద్రతపై కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో, అక్కడి విద్యార్థులను సురక్షిత ప్రాంతమైన ఖోమ్ నగరానికి తరలించినట్లు జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (జేకేఎస్ఏ) మంగళవారం వెల్లడించింది.

అసోసియేషన్ నేషనల్ కన్వీనర్ నాసిర్ ఖుహమీ ఈ విషయంపై మాట్లాడుతూ.. టెహ్రాన్‌లో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయని, అందుకే ముందుజాగ్రత్త చర్యగా భారత ఎంబసీ అధికారులే స్వయంగా రంగంలోకి దిగారని తెలిపారు. ఎంబసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో విద్యార్థులను టెహ్రాన్ నుంచి ఖోమ్‌కు తరలించారని, ప్రస్తుతం వారంతా అధికారుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.

విద్యార్థులతో తమ అసోసియేషన్ నిరంతరం టచ్‌లో ఉందని, వారంతా క్షేమంగా ఉన్నారని నాసిర్ తెలిపారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజమని, అయితే విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి మార్చడం ద్వారా వారి కుటుంబాలకు కొంత ఊరట లభించిందని అన్నారు. భారత విదేశాంగ శాఖ, టెహ్రాన్‌లోని భారత ఎంబసీ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని వెల్లడించారు.

త్వరలోనే విద్యార్థులను భారత్‌కు రప్పించే అవకాశాలు ఉన్నాయని, ఇరాన్ గగనతలం తిరిగి తెరుచుకోగానే దీనిపై తదుపరి చర్యలు ఉంటాయని నాసిర్ పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో భారత ఎంబసీ అధికారులు వేగంగా స్పందించి, విద్యార్థులకు అండగా నిలవడంపై అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని, కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చింది.
Indian Students in Iran
Iran tensions
Tehran
Khom
JKSA
Jammu Kashmir Students Association
Indian Embassy
Student evacuation
Nasir Khuehami
India foreign affairs

More Telugu News