Chandrababu Naidu: ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేతలు
- ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్
- గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై ప్రధానంగా చర్చ
- జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య ఉండవల్లిలోని సీఎం నివాసంలో సుమారు రెండు గంటల పాటు కీలక భేటీ జరిగింది. మంగళగిరిలో 'ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం' సందర్భంగా జరిగిన అటవీ శాఖ 'హనుమాన్' ప్రాజెక్టు ప్రారంభోత్సవం ముగించుకుని పవన్ నేరుగా సీఎం వద్దకు వెళ్లారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై చర్చ జరిగింది.
రాష్ట్రంలో 'జల్ జీవన్ మిషన్' అమలుపై ముఖ్యమంత్రితో పవన్ చర్చించారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు తలసరి 55 లీటర్ల స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని వీరు నిర్ణయించారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్ళించిందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. కేంద్రం ఈ మిషన్ గడువును 2028 వరకు పొడిగించిన నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. కేవలం నీటి సరఫరానే కాకుండా గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం, నిర్వహణపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు, వైరల్ అవుతున్న వీడియోల అంశం కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. టీటీడీ పవిత్రతను కాపాడటంతో పాటు, వస్తున్న ఆరోపణల వెనుక ఉన్న రాజకీయ కోణాలను వీరు విశ్లేషించినట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ ప్రసాదాల్లో నాణ్యత, భక్తుల సౌకర్యాలపై కూడా సమీక్షించారు.
త్వరలో భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా ఇరువురు నేతలు ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.