ఇరాన్ యుద్ధంలో ‘హైదరాబాదీ’ల విలవిల.. టెన్షన్ లో 900 మంది విద్యార్థులు

900 Hyderabad Students Stranded Amidst War Tensions
  • ఫోన్లు పనిచేయక పేరెంట్స్ కన్నీరు
  • సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వానికి వేడుకోలు
  • మరో 2 వేల మంది తెలంగాణ పౌరులు
పశ్చిమ ఆసియాలో రేగుతున్న యుద్ధ జ్వాలలు హైదరాబాద్‌లోని వందలాది కుటుంబాల్లో భయాందోళనలు రేకెత్తించాయి. ఇరాన్‌ పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన సుమారు 900 మంది విద్యార్థులు ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ప్రధానంగా టెహ్రాన్, కుమ్ వంటి నగరాల్లో ఎంబీబీఎస్, ఇతర ఉన్నత చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు యుద్ధం మధ్యలో చిక్కుకుపోయారు.

తల్లిదండ్రుల ఆందోళన..
హైదరాబాద్‌లోని పాతబస్తీ, టోలీచౌకి, నాంపల్లి వంటి ప్రాంతాల నుంచి వెళ్ళిన విద్యార్థుల ఆచూకీ తెలియక వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యుద్ధం కారణంగా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు మొబైల్ నెట్‌వర్క్‌పై కూడా ఆంక్షలు విధించింది. దీంతో గత 24 గంటలుగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అందుబాటులోకి రాలేకపోతున్నారు. ‘‘మా పిల్లల ఫోన్లు కలవడం లేదు.. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్నాం’’ అంటూ పలువురు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

తెలంగాణ వాసుల సంఖ్య ఎక్కువే..
విద్యార్థులే కాకుండా, ఇంజనీర్లు, వ్యాపారులు, వివిధ పనుల నిమిత్తం వెళ్ళిన వారు కలిపి మొత్తం తెలంగాణ నుంచి సుమారు 2 వేల మంది ఇరాన్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారే. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఇరాన్ దేశానికి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి, కానీ ప్రస్తుత యుద్ధ వాతావరణం ఈ సంబంధాలను అతలాకుతలం చేసింది.

భారత ప్రభుత్వం హెల్ప్‌లైన్
భారత రాయబార కార్యాలయం ఇప్పటికే ఒక అడ్వైజరీ జారీ చేస్తూ.. భారతీయులందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ, చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Advertisement
Iran Students
Hyderabad
Iran
Israel
Telangana
MBBS
Tehran
War
Middle East
Indian Embassy

More Telugu News