Advertisement

ఒక రాకుమారుడి హత్య... సౌదీ అరేబియాలో మద్యంపై నిషేధానికి దారితీసిందిలా!

Saudi Arabia alcohol ban history and the prince who caused it
  • లండన్‌లో మద్యం, డ్రగ్స్ కారణంగా సౌదీ రాకుమారుడి మృతి
  • 70 ఏళ్ల క్రితం మరో ప్రిన్స్ చేసిన హత్యతో సౌదీలో మద్యంపై నిషేధం
  • బ్రిటిష్ అధికారిని కాల్చిచంపిన రాకుమారుడు మిషారీ
  • ఆగ్రహంతో మద్యంపై నిషేధం విధించిన నాటి రాజు అబ్దుల్ అజీజ్
  • దశాబ్దాల తర్వాత దౌత్యవేత్తలకు పరిమితంగా మద్యం అమ్మకాలు
లండన్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో సౌదీ అరేబియా రాకుమారుడు అబ్దుల్లా బిన్ ఫహద్ ఇటీవల మరణించారు. మద్యం, పార్టీ డ్రగ్స్, కొన్ని రకాల మందులను కలిపి తీసుకోవడం వల్లే ఆయన చనిపోయినట్లు నిర్ధారణ అయింది. సౌదీలో మద్యంపై కఠిన నిషేధం ఉన్నప్పటికీ, రాజకుటుంబీకులు ఇలాంటి ఘటనల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. సుమారు 70 ఏళ్ల క్రితం, ఇలాగే ఓ రాకుమారుడు మద్యం మత్తులో చేసిన హత్యే... సౌదీలో సంపూర్ణ మద్య నిషేధానికి కారణమైంది.

ఏం జరిగింది?
1950ల ప్రారంభం వరకు సౌదీలో మద్యం అమ్మకాలు, వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు. కానీ 1951, నవంబర్ 16న జరిగిన ఒక ఘటనతో అంతా మారిపోయింది. సౌదీ అరేబియా వ్యవస్థాపకుడు, నాటి రాజు అబ్దుల్ అజీజ్ కుమారుల్లో ఒకరైన ప్రిన్స్ మిషారీ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్... జెడ్డాలోని బ్రిటిష్ వైస్-కాన్సుల్ సిరిల్ ఉస్మాన్ నివాసంలో జరిగిన పార్టీకి హాజరయ్యారు. అక్కడ మద్యం మత్తులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో, ఉస్మాన్ ఆయనను బయటకు పంపించేశారు.

మరుసటి రోజు కూడా అదే మత్తులో తిరిగొచ్చిన ప్రిన్స్ మిషారీ, ఆ మహిళను తనకు అప్పగించాలని డిమాండ్ చేశాడు. ఉస్మాన్ నిరాకరించడంతో ఆగ్రహంతో తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఉస్మాన్ అక్కడికక్కడే మరణించగా, ఆయన భార్య గాయపడ్డారు.

రాజు ఆగ్రహం, మద్యంపై నిషేధం
ఈ హత్య గురించి తెలుసుకున్న రాజు అబ్దుల్ అజీజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తన కొడుకును అరెస్ట్ చేయమని ఆదేశించారు. 1952 నాటి ‘టైమ్’ మ్యాగజైన్ కథనం ప్రకారం... రాజు, ఉస్మాన్ భార్యకు ఓ ఆఫర్ ఇచ్చారు. తన కుమారుడికి ఎలాంటి మరణశిక్ష విధించాలో ఆమెనే నిర్ణయించుకోవచ్చని, అవసరమైతే తల నరికి బ్రిటిష్ ఎంబసీ ముందు వేలాడదీస్తానని చెప్పారు. అయితే ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించి, నష్టపరిహారంగా 70,000 డాలర్లను (ప్రస్తుత విలువలో సుమారు రూ. 9 కోట్లు) స్వీకరించారు. దీంతో ప్రిన్స్ మిషారీకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. తన కుమారుడు మద్యం బారిన పడటానికి విదేశీయులే కారణమని భావించిన రాజు... వెంటనే సౌదీ అరేబియాలో అన్ని రకాల మద్యం దిగుమతులపై నిషేధం విధిస్తూ రాజశాసనం జారీ చేశారు.

ఆ తర్వాత దశాబ్దాల పాటు ఈ నిషేధం కఠినంగా అమలైంది. అయితే, 70 ఏళ్ల తర్వాత సౌదీ తన విధానాన్ని సడలిస్తోంది. 2024లో తొలిసారిగా రియాద్‌లో మద్యం దుకాణాన్ని తెరిచింది. కాకపోతే, ఇది కేవలం ముస్లిమేతర దౌత్యవేత్తలకు మాత్రమే, అదీ నెలవారీ కోటా పద్ధతిలో విక్రయిస్తోంది. 2034 ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా హోటళ్లలో మద్యం విక్రయిస్తామని కూడా సౌదీ ప్రకటించింది. అంటే, ఒక రాకుమారుడి హత్యతో మొదలైన కఠిన నిషేధం... క్రమంగా నీరుగారిపోతోందన్న మాట.
Advertisement
Saudi Arabia
Prince Mishari bin Abdulaziz
Alcohol ban history
King Abdulaziz
Cyril Ousman murder
Saudi Arabia liquor laws

More Telugu News