Nara Lokesh: నారా లోకేశ్ ప్రకటన చేశారు... మాకు అది చాలు: చిన్నారి పునర్విక తండ్రి

Nara Lokesh Announces Support for Punarvika Sri SMA Treatment
  • చిన్నారి పునర్వికశ్రీ చికిత్సకు అవసరమైన రూ.16 కోట్ల నిధులు సమకూరాయన్న తండ్రి సురేశ్ కుమార్
  • ఇకపై ఎవరూ విరాళాలు పంపవద్దని వినతి 
  • తమ కుమార్తె పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలకు హెచ్చరిక
అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి (SMA) టైప్-1 వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన చిన్నారి పునర్వికశ్రీ చికిత్సకు అవసరమైన రూ.16 కోట్ల నిధులు సమకూరాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సేకరించగా, మిగిలిన రూ.6 కోట్లను మంత్రి నారా లోకేశ్ అందిస్తానని భరోసా ఇవ్వడంతో తమ లక్ష్యం నెరవేరిందని చిన్నారి తండ్రి జేఎం సురేశ్ కుమార్ తెలిపారు. గురువారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇకపై ఎవరూ విరాళాలు పంపవద్దని విజ్ఞప్తి చేశారు. 

తన కుమార్తెకు ప్రాణాంతక వ్యాధి ఉందని, రెండేళ్లలోపు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురైనట్లు సురేశ్ కుమార్ పేర్కొన్నారు. స్నేహితుడి సూచనతో 'ఇంపాక్ట్ గురు' వేదికగా క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. లక్షలాది మంది దాతలు స్పందించి రూ.10 కోట్ల వరకు విరాళాలు అందించారని, మిగిలిన రూ.6 కోట్ల కోసం ఆందోళన చెందుతున్న సమయంలో మంత్రి లోకేశ్ బాధ్యత తీసుకుంటానని ప్రకటించడంతో తమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని ఆయన భావోద్వేగంతో చెప్పారు.

ఈ సందర్భంగా సురేశ్ కుమార్ ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేశారు. చికిత్సకు అవసరమైన మొత్తం సమకూరిన తర్వాత కూడా కొందరు వ్యక్తులు తమ కుమార్తె పేరు చెప్పి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ వారికి డబ్బులు ఇవ్వొద్దని కోరారు. దాతలందరికీ, మీడియాకు, మంత్రి లోకేశ్‌కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Nara Lokesh
Punarvika Sri
Spinal Muscular Atrophy
SMA Type-1
Crowdfunding
Kurnool
JM Suresh Kumar
Medical Treatment
Donations
Impact Guru

More Telugu News