Shoaib Akhtar: సచిన్ వికెట్ కోసం 'బెట్టింగ్'.. నొప్పితో నరకం చూసినా ఇంజెక్షన్లతో మైదానంలోకి: షోయబ్ అక్తర్

Shoaib Akhtar reveals painkiller use during India tour
  • 1998-99 నాటి భారత పర్యటనను గుర్తు చేసుకున్న అక్తర్
  • మోకాళ్ల నొప్పితో మైదానంలోకి దిగడానికి తాను, సక్లైన్ ఇంజెక్షన్లు తీసుకున్నామని వెల్లడి
  • సచిన్‌ను ఔట్ చేయాలనే పట్టుదల తమను నడిపించేదన్న అక్తర్  

ప్రపంచ క్రికెట్ చరిత్రలో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి, దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని రికార్డును నెలకొల్పిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, తన కెరీర్‌కు సంబంధించి కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించాడు. 1998-99 భారత్ పర్యటన సమయంలో తాను, మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ పడ్డ నరకాన్ని ఒక టీవీ చర్చా కార్యక్రమంలో గుర్తు చేసుకున్నాడు. భారత్-పాక్ సమరమంటేనే యుద్ధ వాతావరణం నెలకొనే ఆ రోజుల్లో, మోకాళ్ల నొప్పితో విలవిలలాడుతున్నా జట్టులో స్థానం కోల్పోతామనే భయంతో 'సీక్రెట్ ఆపరేషన్' నిర్వహించినట్లు అక్తర్ బయటపెట్టాడు.


నాడు మోకాళ్లు పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉన్నప్పటికీ, మైదానంలోకి దిగడం కోసం తామిద్దరం రహస్యంగా పెయిన్ కిల్లర్ మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకున్నామని అక్తర్ వివరించాడు. ఈ విషయం జట్టులోని సీనియర్లకు తెలిస్తే తమను జట్టు నుంచి సాగనంపుతారనే ఆందోళనతో ఎవరికీ తెలియకుండా ఈ సాహసం చేసినట్లు పేర్కొన్నాడు. కేవలం మ్యాచ్ ఆడాలనే కసితో శరీరానికి అంతటి హాని చేసుకున్నామని గుర్తుచేసుకున్నాడు.


అయితే, ఈ శారీరక ఇబ్బందుల కంటే కూడా భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఔట్ చేయాలనే పట్టుదలే తమను నడిపించిందని అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "సచిన్ వికెట్‌ను ఎవరు తీస్తారు?" అనే విషయంలో తనకూ, సక్లైన్ ముస్తాక్‌కు మధ్య అప్పట్లో బెట్టింగ్ నడిచేదని ఆయన వెల్లడించాడు. మైదానంలో సెహ్వాగ్, సచిన్ వంటి దిగ్గజాలు తన బౌలింగ్‌ను చీల్చిచెండాడిన సందర్భాలు ఉన్నప్పటికీ, సచిన్‌ను ఔట్ చేయడం కోసం తాము పడ్డ ఆరాటం ఆనాటి పోటీతత్వానికి నిదర్శనమని పేర్కొన్నాడు.


మరోవైపు, షోయబ్ తన కెరీర్ లో 46 టెస్టులు, 163 వన్డేలు ఆడినా ఎన్నడూ కెప్టెన్సీని చేపట్టలేదు. కేవలం తన వేగంతోనే క్రికెట్ ప్రపంచాన్ని శాసించాడు.

Shoaib Akhtar
Sachin Tendulkar
India vs Pakistan
Saklain Mushtaq
Cricket betting
Pain killers
Cricket injury
Fast bowling
Virender Sehwag
Pakistan cricket

More Telugu News