భారత్ బడ్జెట్‌లో ‘చాబహార్’కు మొండిచేయి.. ఇరాన్ విదేశాంగ మంత్రి అసంతృప్తి!

Abbas Araghchi Disappointed as India Halts Funding for Chabahar Port
భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు భవిష్యత్తుపై సందేహాలు మొదలయ్యాయి. కేంద్ర బడ్జెట్ 2026-27లో ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపును సున్నాకు తగ్గించడంపై ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హిందూ మహాసముద్రాన్ని మధ్య ఆసియాతో అనుసంధానించే ఈ ‘బంగారు ముఖద్వారం’ (Golden Gateway) విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం నిరాశపరిచిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వ్యాఖ్యానించారు.

గత బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు కోసం మొదట రూ.100 కోట్లు కేటాయించి, ఆ తర్వాత సవరించిన అంచనాల్లో దాన్ని రూ.400 కోట్లకు పెంచిన కేంద్రం, ఈసారి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, ఈ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తాము నిధులు నిలిపివేయలేదని, 10 ఏళ్ల ఒప్పందంలో భాగంగా చెల్లించాల్సిన 120 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇప్పటికే పూర్తిగా చెల్లించేశామని స్పష్టం చేసింది. అందువల్ల ప్రస్తుతానికి కొత్తగా నిధులు కేటాయించాల్సిన అవసరం లేదని వివరించింది.

మరోవైపు, ఈ నిర్ణయం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షల ప్రభావం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై కఠినంగా వ్యవహరిస్తామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చాబహార్ ప్రాజెక్టుకు ఉన్న ఆంక్షల మినహాయింపు గడువు కూడా ఏప్రిల్ 26తో ముగియనుండటం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.

పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా దేశాలకు సరుకు రవాణా చేయడానికి భారత్‌కు చాబహార్ పోర్టు అత్యంత కీలకం. ఈ ప్రాజెక్టు నుంచి భారత్ వెనక్కి తగ్గితే, ఆ ప్రాంతంలో చైనా తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకునే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Chabahar Port
Iran
India Budget
Iran Foreign Minister
Abbas Araghchi
India Iran relations
Chabahar project
US Sanctions
Central Asia trade
Strategic interests

More Telugu News