Ravi Shastri: దక్షిణాఫ్రికాతో ఓడిపోవడం మనకు మంచిదే: రవిశాస్త్రి
- సౌతాఫ్రికాతో ఓటమి ఇండియాకు మేలు చేసేదేనన్న రవిశాస్త్రి
- లేకపోతే అతివిశ్వాసంతో టోర్నీలో ముందుకు వెళ్లేదని వ్యాఖ్య
- పాత తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సూపర్-8 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు పరాజయం పాలవడంపై భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమి ఒక రకంగా జట్టుకు మేలు చేసేదేనని ఆయన అన్నారు. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ గెలిచి ఉంటే, అదే అతివిశ్వాసంతో టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లేదని, అది భవిష్యత్తులో కీలక సమయంలో మరెంత పెద్ద ప్రమాదానికి దారితీసేదేమోనని ఆయన విశ్లేషించారు. ఈ తొలి మ్యాచ్‌లోనే జట్టులోని లోపాలు, నెగిటివ్ పాయింట్లు అన్నీ బయటపడటం శుభపరిణామమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఈ పరాజయంపై సూర్యకుమార్ యాదవ్ సేన గట్టి కసరత్తు చేయాలని ఆయన సూచించారు. అసలు ఏ ఏ రంగాల్లో భారత్ విఫలమైంది, ఎక్కడ మెరుగుపడాలి, కొత్త ప్లేయర్ల అవసరం ఉందా? లేదా? అనే అంశాలపై కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును ముందుండి నడిపించాలని అన్నారు. పాత తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటేనే టీమ్ ఇండియా ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలవడం సాధ్యమవుతుందని శాస్త్రి స్పష్టం చేశారు. ఈ ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలతో తదుపరి మ్యాచ్‌లలో భారత్ సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు, సూపర్-8లో మొదటి మ్యాచ్ ఓడిపోయిన భారత్ ముందరి బాట అంత సులభంగా ఏమీ లేదు. రేపు చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ భారత్‌కు చావో రేవో లాంటిది. ఆ తర్వాత మార్చి ఒకటో తేదీన బలీయమైన వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఈ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడం భారత్‌కు అనివార్యం. లేనిపక్షంలో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.