మీ ఇష్టం... చంపుకోండి: అడవిపందులను విపత్తుగా ప్రకటించిన నేపాల్

Nepal Declares Wild Boars as Disaster Allowing Farmers to Kill Them
షార్ట్స్‌లో చూడండి
నేపాల్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పంటలను తీవ్రంగా నష్టం చేస్తున్న అడవి పందుల విషయంలో రైతులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పొలాల్లోకి వచ్చి నష్టం కలిగిస్తే వాటిని తరిమికొట్టడం, బంధించడం లేదా చంపేయడానికి కూడా అనుమతి ఇస్తూ అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

సుమారు రెండు వారాల క్రితం కోతుల విషయంలోనూ ఇలాంటి ప్రకటనే చేసిన నేపాల్ ప్రభుత్వం, ఇప్పుడు అడవి పందులను కూడా 'వ్యవసాయానికి నష్టం కలిగించే జంతువుల' జాబితాలో చేర్చింది. వన్యప్రాణుల వల్ల రైతులు భారీగా పంట నష్టపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాగు భూములు తగ్గిపోవడం, అటవీ ప్రాంతం విస్తరించడంతో వన్యప్రాణులకు, మానవులకు మధ్య ఘర్షణ పెరుగుతోంది. దీనివల్ల చాలాచోట్ల పొలాలు బీడుగా మారుతున్నాయి, ఉత్పత్తి పడిపోతోంది. కొన్నిసార్లు ఈ జంతువులు మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీసిన సందర్భాలూ ఉన్నాయి.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రైతులు ఒక్కరుగా గానీ, అందరూ కలిసి గానీ పంటలకు నష్టం చేసే అడవి పందులను తరిమికొట్టవచ్చు లేదా బంధించవచ్చు. ఒకవేళ బంధిస్తే, దగ్గర్లోని అటవీ శాఖ కార్యాలయానికి అప్పగించి, స్థానిక వార్డు కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. ఒకవేళ వాటిని తరిమే క్రమంలో అడవి పంది చనిపోతే, స్థానిక ప్రభుత్వ ప్రతినిధి, ఐదుగురు స్థానిక సాక్షుల సమక్షంలో దాన్ని ఖననం చేయాలి. ఈ విషయాన్ని కూడా అధికారులకు తెలియజేయాలి.

అయితే, ఈ నిబంధనలు జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేట్ వ్యవసాయ భూములు, పంట కల్లాలు, పెరటి తోటల్లోకి వచ్చే అడవి పందులకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి.
Go Back to Shorts
Nepal
Wild Boar
Wild Boar Nepal
Agriculture Loss
Crop Damage
Wildlife Conflict
Forestry Nepal
Farmers Nepal
Animal Control
Pest Control

More Telugu News