Steve Bucknor: అది నా తప్పే... సచిన్ ఔట్‌పై 22 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న అంపైర్ స్టీవ్ బక్నర్

Steve Bucknor Admits Mistake in Sachin Tendulkar LBW Decision After 22 Years
  • 2003-04 ఆస్ట్రేలియా సిరీస్‌లో సచిన్‌ను ఔటివ్వడం తప్పేనని అంగీకరించిన బక్నర్ 
  • ఆ బంతి వికెట్లను తాకేది కాదని, అది పొరపాటేనని స్పష్టం చేసిన అంపైర్‌
  • ఆ నిర్ణయం ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని వెల్లడి
  • భారత క్రికెట్ అభిమానుల మదిలో నిలిచిపోయిన ఆ వివాదానికి తెర
క్రికెట్ అభిమానుల మదిలో ఆ దృశ్యం ఇప్పటికీ తాజాగా మెదులుతూనే ఉంటుంది. 2003-04 ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుండగా అంపైర్ స్టీవ్ బక్నర్ ఇచ్చిన వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ ఔట్ నిర్ణయం పెను దుమారం రేపింది. ఆ ఘటన కేవలం మ్యాచ్ ఫలితాన్నే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. సచిన్ కెరీర్‌లో బక్నర్ తీసుకున్న సందేహాస్పద నిర్ణయాలు చాలా ఉన్నప్పటికీ, ఈ ఘటన మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. సరిగ్గా 22 సంవత్సరాల తర్వాత నాటి అంపైర్ స్టీవ్ బక్నర్ ఆ నిర్ణయంపై తన మౌనాన్ని వీడారు. అది తన తప్పేనని అంగీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం 79 ఏళ్ల వయసులో ఉన్న బక్నర్, బ్రిస్బేన్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో సచిన్‌ను ఔట్‌గా ప్రకటించడం పొరపాటేనని అంగీకరించారు. ఆ బంతి స్పష్టంగా వికెట్లను మిస్ అవుతోందని, తాను తప్పుడు నిర్ణయం ఇచ్చానని ఒప్పుకున్నారు. రెండు దశాబ్దాలుగా క్రికెట్ వర్గాల్లో కొనసాగుతున్న చర్చకు తన అంగీకారంతో తెరదించారు. "సచిన్ టెండూల్కర్‌ను లెగ్ బిఫోర్ వికెట్‌గా ఔటిచ్చాను. అది ఒక పొరపాటు అని నాకు తెలుసు. కానీ ఈ రోజు వరకు, ప్రతీరోజూ ప్రజలు దాని గురించే మాట్లాడుకుంటారు. నేను ఎందుకు ఔటిచ్చాను? అతను నిజంగా ఔటా? కాదా? అని అడుగుతారు. జీవితంలో తప్పులు జరుగుతాయి. అది నా తప్పేనని అంగీకరించాను. జీవితం ముందుకు సాగాలి" అని వెస్టిండీస్ క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్‌తో బక్నర్ పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..!
బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ గిలెస్పీ వేసిన బంతిని సచిన్ వదిలేయడానికి ప్రయత్నించారు. కానీ బంతి అనూహ్యంగా టర్న్ అయి ప్యాడ్లను తాకింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయడంతో అంపైర్ బక్నర్ వెంటనే వేలు పైకెత్తారు. ఈ నిర్ణయంతో సచిన్ దిగ్భ్రాంతికి గురవ్వగా, టీవీల్లో మ్యాచ్ చూస్తున్న కోట్లాది మంది అభిమానులు నివ్వెరపోయారు. ఆ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న దిగ్గజ కామెంటేటర్ టోనీ గ్రెగ్, "ఇది అత్యంత చెత్త నిర్ణయం. బంతి బౌన్స్, కదలిక చూడండి" అంటూ తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.

కొంతకాలం క్రితం బక్నర్‌పై తన అభిప్రాయం చెప్పమని సచిన్‌ను అడిగినప్పుడు, మాస్టర్ బ్లాస్టర్ తనదైన శైలిలో చమత్కరించారు. "నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతను (బక్నర్) వేలు పైకెత్తకుండా చేతులకు బాక్సింగ్ గ్లోవ్స్ ఇవ్వాలి" అని వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు. ఏదేమైనా బక్నర్ తాజా అంగీకారంతో ఒక చారిత్రక వివాదానికి ముగింపు పలికినట్లయింది.
Steve Bucknor
Sachin Tendulkar
LBW controversy
2003-04 Australia series
Brisbane Test
Jason Gillespie
Cricket umpire
Umpire mistake
Tony Greig
Cricket

More Telugu News