Ambati Rambabu: ఏడు గంటల పాటు నా ఇంటిపై బీభత్సం.. నారా లోకేశ్ ఆదేశాలతోనే దాడి జరిగింది: అంబటి రాంబాబు

Ambati Rambabu Alleges Attack on Home Ordered by Nara Lokesh
  • తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసేలా దాడులు జరిగాయన్న అంబటి
  • దాడుల వెనుక ఉన్నది పైస్థాయి ఆదేశాలేనని స్పష్టీకరణ
  • తన ఇంట్లోని మహిళలు ప్రాణభయంతో వెనుక గేటు నుంచి బయటకు వెళ్లేలా చేశారని మండిపాటు

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అధికార కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడిని ఉద్ధృతం చేశారు. తన నివాసంపై జరిగిన దాడి వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఉన్నారని ఆయన ఘాటుగా ఆరోపించారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన... తాను జైలులో ఉన్న సమయంలో తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తన ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర కాదా? అని నిలదీశారు. లోకేశ్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు.


తమ ఇంట్లోని మహిళలు ప్రాణభయంతో వెనుక గేటు నుంచి బయటకు వెళ్లాల్సిన దుస్థితి కల్పించారని అంబటి పేర్కొన్నారు. సాధారణంగా ఆవేశంలో దాడులు జరగడం చూస్తుంటామని, కానీ ఏకంగా ఏడు గంటల పాటు పోలీసులు నిర్వీర్యంగా ఉండిపోయారంటే దాని వెనుక ఉన్నది పైస్థాయి ఆదేశాలేనని ఆయన స్పష్టం చేశారు. తన ఆఫీసును, ఇంటిని తగలబెట్టాలనే లక్ష్యంతోనే ఈ అల్లర్లను ప్రోత్సహించారని ఆరోపించారు. మాజీ మంత్రి హోదాలో ఉన్న తన ఇంటికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.


ఈ కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను జైలులో ఉన్నప్పుడు పార్టీ అధినేత జగన్ తన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. 18 రోజుల జైలు జీవితం తర్వాత వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశానని, ప్రభుత్వ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

Ambati Rambabu
Nara Lokesh
Chandrababu Naidu
YCP
Andhra Pradesh Politics
Rajamundry Jail
Political Attack
YS Jagan
TDP
AP Government

More Telugu News