టీ20 వరల్డ్ కప్: సెమీస్‌లో భారత్-పాక్ తలపడితే ముంబైలో మ్యాచ్ లేనట్టే!

T20 World Cup India Pakistan semi final match may not be in Mumbai
షార్ట్స్‌లో చూడండి
2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో ఒక ఆసక్తికరమైన నిబంధన తెరపైకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం సూపర్-8 దశను దాటి టీమిండియా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే, ఒకవేళ సెమీస్‌లో భారత్ ప్రత్యర్థిగా పాకిస్థాన్ నిలిస్తే మాత్రం ఈ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ఆ మ్యాచ్ ముంబైలో జరగదు.

భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే, దానిని ముంబై నుంచి శ్రీలంకలోని కొలంబోకు తరలిస్తారు. ఇరు దేశాల మధ్య 2027 వరకు అమల్లో ఉన్న 'హైబ్రిడ్ మోడల్' ఒప్పందమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఒప్పందం ప్రకారం, దాయాదుల మధ్య జరిగే మ్యాచ్‌లను తటస్థ వేదికలపైనే నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో ఆసియా కప్ సమయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించిన సంగతి తెలిసిందే.

ఒకవేళ సెమీఫైనల్‌లో భారత్-పాక్ తలపడితే, ఆ మ్యాచ్ మార్చి 4వ తేదీన జరుగుతుంది. విశేషమేమిటంటే, ఆ రోజు భారత్‌లో హోలీ పండుగ. దేశమంతా రంగుల వేడుకల్లో మునిగి తేలుతున్న సమయంలో, శ్రీలంక గడ్డపై దాయాదుల పోరు అభిమానులకు ఉత్కంఠను పంచనుంది. ఒకవేళ పాకిస్థాన్ కాకుండా మరే ఇతర జట్టుతోనైనా భారత్ సెమీఫైనల్ ఆడితే, ఆ మ్యాచ్ ముందుగా నిర్ణయించినట్లే మార్చి 5న ముంబైలోనే జరుగుతుంది. ఈ నిబంధనల ప్రకారం, పాకిస్థాన్ ఆడే మొదటి సెమీఫైనల్ కూడా కోల్‌కతా నుంచి కొలంబోకు మారనుంది.
Go Back to Shorts
T20 World Cup
India vs Pakistan
T20 World Cup 2026
Mumbai
Colombo
Hybrid Model
ICC
Cricket
Semi-Finals
Holi

More Telugu News