Manik Gupta: మైదానంలో మృత్యుపాశం.. తేనెటీగల దాడిలో సీనియర్ క్రికెట్ అంపైర్ మృతి!

Manik Gupta Senior cricket umpire dies in bee attack in Kanpur
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా తేనెటీగల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో సీనియర్ అంపైర్ ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ (KCA) నిర్వహిస్తున్న అండర్-13 మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో 65 ఏళ్ల మాణిక్ గుప్తా మృతి చెందారు.

స్థానిక స్టేడియంలో మ్యాచ్ ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో, వేలాది తేనెటీగలు అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చాయి. దీంతో క్రీడాకారులు, ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. అయితే, అంపైర్ మాణిక్ గుప్తా వాటి బారి నుంచి తప్పించుకోలేకపోయారు. వందలాది తేనెటీగలు ఆయనను చుట్టుముట్టి కుట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిపోయారు.

వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మరో అంపైర్ జగదీశ్ శర్మతో పాటు పలువురు చిన్నారులు కూడా గాయపడగా, ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

మాణిక్ గుప్తా గత 30 ఏళ్లుగా కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌కు సేవలు అందిస్తున్నారు. ఆయన మృతి పట్ల స్థానిక క్రీడా వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ ఘటన నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ఉన్న తేనెతుట్టెలను తొలగించాలని అధికారులు ఆదేశించారు. గతంలో 2019లో తిరువనంతపురంలో ఇండియా-ఎ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా కూడా ఇలాగే తేనెటీగలు దాడి చేశాయి. అయితే అప్పుడు ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు.
Go Back to Shorts
Manik Gupta
Kanpur
cricket umpire
bee attack
cricket match
Uttar Pradesh
Kanpur Cricket Association
under 13 match
Jagadish Sharma

More Telugu News