Galgotias University: థర్మాకోల్ తో డ్రోన్ చేసి ఏఐ సదస్సులో ప్రదర్శన.. గల్గోటియా యూనివర్సిటీ నిర్వాకం

Galgotias University Showcases Thermocol Drone at AI Summit Sparks Outrage
  • దక్షిణ కొరియా సాకర్ డ్రోన్ ను తమ ఆవిష్కరణగా చూపించిన ప్రొఫెసర్
  • చైనా రోబో డాగ్ వివాదంలో యూనివర్సిటీని ఏఐ సదస్సు నుంచి గెంటివేసిన నిర్వాహకులు
  • తమ ప్రతినిధి అత్యుత్సాహమే కారణమంటూ బొంకుతున్న యూనివర్సిటీ
చైనా రోబో డాగ్ ను కొని తెచ్చి తామే అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేసుకున్న గల్గోటియా యూనివర్సిటీ మరో రెండు ఉత్పత్తులనూ ఏఐ సదస్సులో ప్రదర్శనకు ఉంచింది. అందులో ఒకటి పిల్లలు ఆడుకునే థర్మాకోల్ డ్రోన్ కావడం విశేషం. థర్మాకోల్ తో డ్రోన్ ను తయారు చేసి దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ సదస్సులో ప్రదర్శనకు పెట్టి నవ్వులపాలైంది. అంతేకాదు, దక్షిణ కొరియా తయారు చేసిన సాకర్ డ్రోన్ ను కొనుగోలు చేసి ఈ సదస్సుకు తీసుకొచ్చింది. అది కూడా తమ వర్సిటీ విద్యార్థులే తయారుచేశారని చెప్పుకుంది.

యూనివర్సిటీ తరఫున సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ నేహా సింగ్ రోబో డాగ్ తో పాటు ఈ సాకర్ డ్రోన్ ను, థర్మాకోల్ డ్రోన్ ను తమ ఘనతగా ప్రచారం చేసుకుంది. రోబోడాగ్ వివాదంలో కీలకంగా ఉన్న ప్రొఫెసర్ నేహా సింగ్ ఈ ‘సాకర్ డ్రోన్’ను ప్రదర్శిస్తున్న మరో వీడియో వైరల్‌గా మారింది. అయితే, ఈ డ్రోన్ దక్షిణ కొరియాకు చెందిన హెల్సెల్ గ్రూప్ అభివృద్ధి చేసిన సాకర్ డ్రోన్ తరహాలో ఉందని నెటిజన్లు గుర్తించారు. చైనా రోబోడాగ్ వ్యవహారంతో మండిపడ్డ నిర్వాహకులు.. గల్గోటియా యూనివర్సిటీ సిబ్బందిని సదస్సు నుంచి గెంటివేశారు. 

యూత్ కాంగ్రెస్ ఎద్దేవా..
గల్గోటియా యూనివర్సిటీ నిర్వాకాన్ని, కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్’ నినాదాన్ని ఎద్దేవా చేస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ‘‘ముందు చైనా, ఇప్పుడు కొరియా. గల్గోటియాస్ ‘అరువు’ తెచ్చుకున్న ఆవిష్కరణలతో ప్రపంచ పర్యటన చేస్తోంది. క్యాంపస్‌లోనే మొదటి నుండి ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సాకర్‌ను నిర్మించామని వారు క్లెయిమ్ చేశారు, కానీ అది నిజానికి కొరియాకు చెందిన ‘స్ట్రైకర్’ డ్రోన్” అని యూత్ కాంగ్రెస్ పేర్కొంది. ‘‘ఇది ఆత్మనిర్భర్ నా? లేక ‘ఆత్మనిర్-బై’ నా మోదీ జీ?’’ అంటూ చురకలు అంటించింది.

గల్గోటియా ప్రొఫెసర్ ఏం చెప్పారు..
ఉత్పత్తులను ప్రదర్శిస్తూ ప్రొఫెసర్ నేహా సింగ్ మాట్లాడుతూ.. ఇది "భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ సాకర్ అరేనా" అని, దీనిని యూనివర్సిటీ క్యాంపస్‌లో కూడా చూడవచ్చని చెప్పారు. "ఇది ఒక ఆసక్తికరమైన ఉత్పత్తి. దీని ఎండ్-టు-ఎండ్ ఇంజనీరింగ్ నుండి అప్లికేషన్ వరకు ప్రతిదీ మా యూనివర్శిటీలోనే జరిగింది" అని ఆమె పేర్కొన్నారు.

ప్రొఫెసర్ అత్యుత్సాహమే కారణమన్న యూనివర్సిటీ..
గల్గోటియా యూనివర్సిటీ బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఏఐ సదస్సులో గందరగోళానికి క్షమాపణలు చెప్పింది. సరైన సమాచారం లేకుండా తమ ప్రొఫెసర్ అత్యుత్సాహంతో మాట్లాడారని, ఆ ఉత్పత్తి యొక్క సాంకేతిక మూలాల గురించి ఆమెకు తెలియదని పేర్కొంటూ బాధ్యతను ఆమెపైనే నెట్టివేసింది.


Galgotias University
AI Summit
Drone Soccer
China Robot Dog
Neha Singh
South Korea
Atmanirbhar Bharat
Indian Youth Congress
Thermocol Drone
Innovation

More Telugu News