Botsa Satyanarayana: ఫీజు రీయింబర్స్‌మెంట్ పై మండలిలో రచ్చ.. వాకౌట్ చేయడం తమకు ఫ్యాషన్ కాదన్న బొత్స

Botsa Satyanarayana Slams Government on Fee Reimbursement in Council
  • ప్రభుత్వంలో మార్పు వస్తుందనే వాకౌట్ చేస్తున్నామన్న బొత్స
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ 8 విడతల బకాయిలు ఉన్నాయన్న వైసీపీ ఎమ్మెల్సీ భరత్
  • గత ప్రభుత్వం రూ.4,064.59 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిందన్న లోకేశ్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రచ్చ మొదలైంది. ప్రభుత్వం అసత్యాలు మాట్లాడుతోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. తమకు వాకౌట్ చేయడం ఫ్యాషన్ కాదని, అలా చేస్తే అయినా కూటమి ప్రభుత్వంలో మార్పు వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. తాము సమాధానాలు చెబితే వినాలని, అవాస్తవాలు మాట్లాడటం సరికాదన్నారు.


వైసీపీ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ, రూ.8,500 కోట్లు బకాయిలున్నాయని, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.700 కోట్లు మాత్రమే చెల్లించిందని, ఇంకా రూ.7,800 కోట్లు పెండింగ్ ఉన్నాయని ఆరోపించారు. జగన్ హయాంలో బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లించామని, కూటమి ప్రభుత్వం 8 విడతల బకాయి పెట్టిందని మండిపడ్డారు.


మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పందిస్తూ, వైసీపీ సభ్యులు అవాస్తవాలు చెబుతున్నారని, ఏ క్వార్టర్‌కు ఆ క్వార్టర్ చెల్లింపులు చేశామనడం అబద్ధమని అన్నారు. ఇప్పటివరకు రూ.1,859 కోట్లు చెల్లించామని, ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల బకాయిలు పూర్తిగా క్లియర్ చేశామని వివరించారు. కాలేజీలకు ఇప్పటికే చెల్లింపులు చేసిన విద్యార్థుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని తెలిపారు.


బొత్స సత్యనారాయణ మళ్లీ స్పందిస్తూ, గత ప్రభుత్వం రూ.4,000 కోట్లు బకాయి పెట్టిందని చెప్పడం అసత్యమని, ఎన్నికల కోడ్ వల్ల ఒక్క క్వార్టర్ మాత్రమే పెండింగ్ అయిందని, అది కూడా అప్పటి ప్రతిపక్షం (టీడీపీ) ఈసీకి ఫిర్యాదు చేయడం వల్ల జరిగిందని అన్నారు. పెండింగ్ బకాయిలు ఎప్పటికి చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.


మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇస్తూ, బొత్స బకాయిలు లేవని చెప్పడం నిజం కాదని, రికార్డుల ప్రకారమే మాట్లాడుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం రూ.4,064.59 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిందని, అన్ని ఆధారాలు సభ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.

Botsa Satyanarayana
Fee Reimbursement
Andhra Pradesh Legislative Council
YS Jagan
Nara Lokesh
AP Politics
Education
Debt
Government Schemes
Dola Sri Bala Veeranjaneya Swamy

More Telugu News