Ali Khamenei: అమెరికాతో ఉద్రిక్తతలు.. 37 ఏళ్ల సంప్రదాయానికి ఖమేనీ బ్రేక్

Ali Khamenei Breaks 37 Year Tradition Amid US Tensions
  • 37 ఏళ్లలో తొలిసారి ఎయిర్‌ఫోర్స్ సమావేశానికి గైర్హాజరైన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
  • అమెరికాతో తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఈ అనూహ్య పరిణామం
  • గల్ఫ్ ప్రాంతంలో భారీగా సైనిక బలగాలను మోహరిస్తున్న అమెరికా
  • అమెరికా దాడి చేస్తే యుద్ధం తప్పదని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు
అమెరికాతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరాన్‌లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ 37 ఏళ్లుగా పాటిస్తున్న ఒక కీలక సంప్రదాయాన్ని తొలిసారిగా పక్కనపెట్టారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 8న జరిగే వైమానిక దళ కమాండర్ల సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. 1989లో నాయకత్వ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఖమేనీ ప్రతి సంవత్సరం ఈ సమావేశానికి హాజరవుతూ వస్తున్నారు. ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం ప్రకారం కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో కూడా ఆయన ఈ సమావేశాన్ని నిర్వహించారు.

1979 ఫిబ్రవరి 8న ఇరాన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు పహ్లవి రాజవంశాన్ని కూలదోసి, ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతొల్లా రుహొల్లా ఖమేనీకి మద్దతు ప్రకటించారు. ఆ చారిత్రక ఘటనకు గుర్తుగా ఏటా ఈ తేదీన వైమానిక దళ ఉన్నతాధికారులు సుప్రీం లీడర్‌తో భేటీ అవుతారు. ఈ ఏడాది ఖొమేనీకి బదులుగా ఆర్మీ చీఫ్ అబ్దొల్‌రహీం మౌసవి కమాండర్లతో సమావేశమయ్యారు.

అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఖమేనీ గైర్హాజరు వెనుక అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతలే కారణమని అంతర్జాతీయంగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక ఉనికిని భారీగా విస్తరిస్తోంది. తమపై అమెరికా దాడి చేస్తే, ఈసారి యుద్ధం మధ్యప్రాచ్యం మొత్తం విస్తరిస్తుందని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. గతేడాది జూన్‌లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.

ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను అరేబియా సముద్రానికి పంపింది. డజను ఎఫ్-15 ఫైటర్ జెట్లు, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, ఇతర యుద్ధ విమానాలు జోర్డాన్‌లోని వైమానిక స్థావరానికి చేరుకున్నాయని బీబీసీ తన కథనంలో పేర్కొంది. యూఎస్ఎస్ డెల్బర్ట్ డి బ్లాక్ యుద్ధనౌక సూయజ్ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలోకి ప్రవేశించినట్టు శాటిలైట్ చిత్రాలను విశ్లేషించి వెల్లడించింది. గల్ఫ్ ప్రాంతంలో నిఘా కోసం పలు డ్రోన్లు, నిఘా విమానాలు కూడా తిరుగుతున్నట్టు సమాచారం. ఇరాన్ క్షిపణి వ్యవస్థపై చర్చ జరగాలని అమెరికా పట్టుబట్టడం, తాము కేవలం అణు కార్యక్రమంపైనే చర్చిస్తామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.
Ali Khamenei
Iran
United States
US Iran tensions
Iran supreme leader
Middle East conflict
Iran air force
military
nuclear program
Persian Gulf

More Telugu News