KTR: మేం వస్తే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం: కేటీఆర్

KTR Warns Congress Over Land Deals in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మేస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

కర్ణాటకలోని అత్తిబెలెలో ఇన్ఫోసిస్‌కు చెందిన విలువైన భూమిని పురవంకర సంస్థకు రూ.250 కోట్లకు అమ్మడంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ఓ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. రాయితీపై పొందిన భూమిని నిర్దిష్ట ప్రయోజనానికి వాడనప్పుడు, దానిని వాణిజ్య ధరకు అమ్ముకునే హక్కు ఇన్ఫోసిస్‌కు లేదని, దాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని కార్తీ చిదంబరం పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "తెలంగాణలోనూ అదే డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాల కల్పన వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం రాయితీలపై ఇచ్చిన భూములను అమ్మి, బంధువులకు లబ్ధి చేకూర్చే హక్కు ప్రభుత్వానికి లేదు. ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించి ప్రజల అవసరాలకు వాడాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, పేదలకు ఇళ్లు, పార్కులు, బస్ స్టాండ్లు, పార్కింగ్ కోసం ఆ స్థలాలు అవసరం" అని కేటీఆర్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

'హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ' పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. మార్కెట్‌లో గజం లక్ష రూపాయలు పలికే భూమిని కేవలం రూ.4,000కే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ 'సేల్ ఆఫర్' చూసి మోసపోవద్దని రియల్ ఎస్టేట్ డెవలపర్లను హెచ్చరించిన కేటీఆర్, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Go Back to Shorts
KTR
K T Rama Rao
Telangana
Congress
Land Scam
Industrial Land
BRS
Real Estate
Hyderabad
Puravankara

More Telugu News