'బాహుబలి'తో మరో రికార్డు దిశగా ఇస్రో
- బాహుబలి ఎల్వీఎం-3తో 6,400 కిలోల అమెరికా ‘బ్లూబర్డ్’ ఉపగ్రహ ప్రయోగం
- భారత గడ్డపై నుంచి ఇంత భారీ ఉపగ్రహం ఇదే తొలిసారి
- అమెరికా ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో వాణిజ్య ఒప్పందం
- 4,400 కిలోల పాత రికార్డు బ్రేక్‌కు సిద్ధం
- ఇది ఇస్రో వాణిజ్య ప్రయోగాల్లో మరో చారిత్రక మైలురాయి
ఈ ప్రయోగంలో 6,400 కిలోల బరువున్న బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ఎల్వీఎం-3-ఎం6 రాకెట్ మోసుకెళ్లనుంది. ప్రయోగం జరిగిన 15.07 నిమిషాల్లో రాకెట్ మూడు దశలు పూర్తిచేసి, ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ సంస్థతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. భారత భూభాగం నుంచి ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇప్పటివరకు ఇస్రో సాధించిన 4,400 కిలోల పేలోడ్ ప్రయోగ రికార్డు ఈ ప్రయోగంతో బ్రేక్ కానుంది. బాహుబలిగా పేరుగాంచిన ఎల్వీఎం-3 రాకెట్ 43.5 మీటర్ల ఎత్తు, 640 టన్నుల బరువుతో అత్యంత విశ్వసనీయ రాకెట్‌గా గుర్తింపు పొందింది. ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 సహా ఇప్పటివరకు చేపట్టిన ఎనిమిది ప్రయోగాలు విజయవంతమయ్యాయి. కాగా, ఎల్వీఎం-3 ద్వారా చేపడుతున్న మూడో వాణిజ్య ప్రయోగమిది. గతంలో వన్‌వెబ్ సంస్థకు చెందిన రెండు వాణిజ్య ఉపగ్రహాలను ఈ రాకెట్ కక్ష్యలోకి చేర్చింది.
ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మిషన్ భారత అంతరిక్ష రంగానికి గర్వకారణంగా నిలవనుంది. భారీ అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత రాకెట్ మోసుకెళ్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగం చూపంతా ఇప్పుడు ఇస్రోపైనే కేంద్రీకృతమైంది.