Foreign Prostitution Racket: హైదరాబాద్‌లో విదేశీయుల వ్యభిచార ముఠా గుట్టురట్టు.. చదువు పేరుతో వచ్చి దందా

Foreign Prostitution Racket Busted in Hyderabad
  • మియాపూర్‌లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార రాకెట్ బట్టబయలు
  • నిర్వాహకుడి సహా ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • స్టూడెంట్ వీసాపై వచ్చి దందా నిర్వహిస్తున్న లైబేరియా జాతీయుడు
  • కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళలతో వ్యభిచారం
  • నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించిన అధికారులు
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విదేశీయులు నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్‌ఓటీ, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో నిర్వాహకుడి సహా మొత్తం ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేశారు.

మియాపూర్ పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. న్యూ హఫీజ్‌పేట్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి తనిఖీలు చేపట్టగా, అక్కడ విదేశీ మహిళలతో వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారించారు.

ఈ రాకెట్‌ను లైబేరియా దేశానికి చెందిన డేరియస్ (28) నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇతడు 2021లో స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చి, స్థానికంగా ఓ కళాశాలలో ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నాడు. కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళలతో ఇతడు ఈ దందాను నడిపిస్తున్నట్లు విచారణలో తేలింది.

నిందితుడు డేరియస్‌తో పాటు నలుగురు విదేశీ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4 వేల నగదు, కొన్ని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా, ప్రధాన నిందితుడైన డేరియస్‌ను రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Foreign Prostitution Racket
Hyderabad prostitution racket
Miyapur police
Darius
Foreign women prostitution
Liberia student visa
Kenya Uganda women
Cyberabad SOT raid
New Hafeezpet
Prostitution ring busted

More Telugu News